Chandrababu Arrest: చంద్రబాబును జైల్లో పెట్టాలన్నదే జగన్ జీవిత లక్ష్యం: బాలకృష్ణ
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో సీఎం జగన్ పై బాలకృష్ణ విమర్శలు గుప్పించారు.
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు అక్రమమని, దుర్మార్గమని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని పేర్కొన్నారు. తాను 16 నెలలు జైలులో ఉన్నాను, చంద్రబాబును 16 నిమిషాలైనా జైలులో పెట్టాలన్నదే జగన్ మోహన్ రెడ్డి జీవిత లక్ష్యమని బాలకృష్ణ మండిపడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని ఏ చట్టం ప్రకారం అరెస్టు చేశారని బాలయ్య బాబు ప్రశ్నించారు.
చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్షతో చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. 19.12.2021 లో స్కిల్ డెవలప్‌మెంట్ లో అవినీతి జరిగిందంటూ ఎఫ్ఐఆర్ నమోదైందని, నిజంగా అవినీతి జరిగే ఉంటే ఇంత వరకు ఎందుకు ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదని బాలకృష్ణ ప్రశ్నించారు. డిజైన్ టెక్ సంస్థ అకౌంట్లు ఫ్రీజ్ చేసి నిధులు స్తంభింపజేసినప్పుడు కోర్టు చివాట్లు పెట్టి ఆ డబ్బు నేరాని సంబంధించింది కాదనని ఆదేశాలిచ్చిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. 2.13 లక్షల విద్యార్థులకు శిక్షణ ఇచ్చి 72 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని, అలాంటి అద్భుతమైన పనిని కుంభకోణం అని ఎలాగంటారు అంటూ హైకోర్టు ప్రశ్నించింది అని గుర్తు చేశారు.
ఎలాంటి అవినీతి జరగని పనిలో చంద్రబాబును అరెస్టు చేయడం రాజకీయ కుట్రనేనని అన్నారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. దీనిపై ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామని సవాల్ చేశారు.
శనివారం తెల్లవారుజామున బాబు అరెస్టు
చంద్రబాబును పోలీసులు శనివారం వేకువజామున అరెస్టు చేశారు. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును తీవ్ర ఉద్రిక్తత మధ్య పోలీసులు అరెస్టు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుల్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రస్తుతం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. శుక్రవారం నంద్యాలలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళాశక్తి పథకాలను వివరించేందుకు మహిళలతో మాట్లాడారు. సాయంత్రానికి బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం చంద్రబాబు స్థానికంగా ఉండే ఓ ఫంక్షన్ హాల్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు.
నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఉన్న ఫంక్షన్ హాల్‌కు చేరుకున్న పోలీసులు అరెస్టు చేస్తున్నట్టు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు అరెస్టు సందర్భంగా చాలా హైడ్రామా నడిచింది. శుక్రవారం సాయంత్రం నుంచే ఆయన్ని అరెస్టు చేస్తున్నారన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీన్ని టీడీపీ వర్గాలు, పోలీసులు ఖండించినప్పటికీ సైలెంట్‌గా పని కానిచ్చేశారు పోలీసులు.
రెండు రోజుల క్రితమే సంకేతాలు
నిప్పులా బతికిన తనపైనే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల క్రితం మండిపడ్డారు. జగన్ అరాచక పాలన అంతం కోసం ఇంటికొకరు తనతో పాటు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒకటి, రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. తనపై కూడా దాడి చేస్తారని అన్నారు. ఎన్ని చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు. మహాభారతం, రామాయణంలో ధర్మం గెలిచినట్టు చివరకు మనమే గెలుస్తామని అన్నారు. గతంలో ఎప్పుడూ రాని మెజార్టీ ఈ ఎన్నికల్లో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో పల్లె ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.