AP Cabinet List: కొడాలి నానికి మంత్రి పదవి ఖాయమట! దీనిపై జోరుగా సాగుతున్న బెట్టింగులు
Kodali Nani: గుడివాడలో మంత్రి కొడాలి నాని అనుచరుల వ్యవహారంలో ఏకంగా బెట్టింగులు కూడా నడుస్తున్నాయి. పక్క జిల్లాల్లో సైతం బెట్టింగుల జోరు నడుస్తోంది
AP New Ministers Names: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కేబినెట్ (AP New Cabinet) ఏర్పాటు విషయంలో రకరకాల ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే తుది జాబితాలో పేరు ఉన్న వారికి వ్యక్తిగతంగా ఫోన్ కాల్స్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ కు (Dharmana Prasad) మంత్రివర్గంలో చోటుదక్కిందంటూ ఆయన అభిమానులు ఇప్పటికే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. స్వీట్లు కూడా పంపిణీ చేసుకుంటున్నారు. ఇది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పటికే ధర్మాన ప్రసాద్ అయితే మాత్రం ఎటువంటి సమాచారం రాలేదంటూ చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా తనకు ఏదైనా పర్వాలేదని అన్నారు. కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దని చెప్పుకొచ్చారు.
మరోవైపు, గుడివాడలో మంత్రి కొడాలి నాని (Kodali Nani) అనుచరుల వ్యవహారంలో ఏకంగా బెట్టింగులు కూడా నడుస్తున్నాయి. పక్క జిల్లాల్లో సైతం బెట్టింగుల జోరు నడుస్తోంది. ఆయనను మంత్రి పదవి కచ్చితంగా వరిస్తుందనే అంశంపై భారీ బెట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి. అధికారికంగా ఏమీ ప్రకటించకముందే పందేలు తారస్థాయికి చేరుతున్నాయి. తాజా మంత్రివర్గ ఎంపికపై కొడాలి నాని (Kodali Nani) పేరు విషయంలో ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఈ బెట్టింగులో జోరుగా సాగుతున్నాయి. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ (Grandhi Srinivas) విషయంలోనూ కూడా బెట్టింగ్‌ల జోరు నడుస్తోంది.
మరోవైపు, నెల్లూరు (Nellore) జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి (Kakani Govardhan Reddy) నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. కాకాణికి మంత్రి వర్గంలో చోటు ఖరారు అయిపోయిందనే ప్రచారంతో ఆయన అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఆదివారం ఉదయం ఆయన ఇంటి దగ్గరికి చేరుకొని ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. పలువురు నేతలు, కార్యకర్తలు కాకాణి గోవర్థన్‌కు (Kakani Govardhan Reddy) ఫోన్లు చేసి మరీ అభినందనలు తెలుపుతున్నారు.
పిన్నెల్లికి మంత్రిపదవి ఇవ్వకపోతే మూకుమ్మడి రాజీనామాలంటూ నిరసన
మాచర్ల నియోజకవర్గంలోని వైఎస్ఆర్ సీపీలో (YSRCP) కలకలం రేగుతోంది. పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఈసారి మంత్రి పదవి ఇవ్వకపోతే తామంతా రాజీనామాలకు చేసేస్తామని స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు హెచ్చరించారు. ఈ మేరకు మాచర్లలోని మున్సిపల్ కార్యాలయంలో వారు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, ఎంపీడీవో కార్యాలయంలో కూడా జిల్లా సర్పంచ్‌లు సమావేశయ్యారు. పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డికి (Pinnelli Ramakrishna Reddy) ఈ సారి కేబినెట్‌లో అవకాశం ఇవ్వకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని సర్పంచ్‌లు కూడా హెచ్చరించారు.