Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
AP CM Chandra Babu:వచ్చే ఎన్నికల్లో కూటమిగానే పోటీ చేస్తున్నామని చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. పార్టీలను సమన్వయం చేసుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. తోక జాడించ వద్దని కూడా తమ్ముళ్లకు హెచ్చరించారు.
Andhra Pradesh: ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ఏ నాయకుడు ప్రవర్తించినా కఠిన చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు టీడీపీ నేతలకు హెచ్చరించారు. విజయవాడలో రాష్ట్రంలోని టీడీపీ ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. కూటమి అధికారంలోకి రావడానికి టీడీపీ శ్రేణులు, నేతలు తీవ్రంగా శ్రమించారని కితాబు ఇచ్చారు. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఐదేళ్లలో చాలా సమస్యలు ఎదుర్కొన్నారని వాటిని పార్టీ ఎప్పటికీ మర్చిపోదున్నారు. వాటిన్నింటిపై కసి తీర్చుకోవాలని పార్టీ కేడర్ ఆవేశంతో ఉందని గుర్తు చేశారు. గతంలో ఇలాంటి తప్పులే చేసి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదని తెలిపారు. ఇప్పుడు అధికారంలో ఉన్న మనం కూడా అలాంటి తప్పులే చేస్తే రెండు పార్టీలకు తేడా ఉండదన్నారు.
మద్యం వ్యాపారాలకు దూరంగా ఉండండి: చంద్రబాబు
అలాగని తప్పులు చేసిన వారిని ఎవర్నీ వదిలి పెట్టే ప్రసక్తి లేదని చెప్పారు చంద్రబాబు. న్యాయపరిధిలో వారందరికీ శిక్షలు పడతాయని చెప్పుకొచ్చారు. అంతే కాని వైసీపీపై కక్ష సాధింపులకు అవకాశం లేదని స్పష్టం చేశారు అలా ఎవరూ కోరుకోవద్దన్నారు. అది రాష్ట్రానికి కూడా మంచిది కాదని ప్రజలు హర్షించబోరని అన్నారు. చిన్న ఉద్యోగి తప్పు చేస్తే సీఎంను తిడతారని... అదే కార్యకర్త తప్పు చేస్తే సీఎంతోపాటు ప్రభుత్వాన్నే తిడతారని చెప్పుకొచ్చారు చంద్రబాబు. అందుకే కార్యకర్తలు, నేతలు అనవసరమైన విషయాల్లో కలుగుజేసుకోవద్దని సూచించారు. మద్యం వ్యాపారాలకు, ఇసుక దందాలకు దూరంగా ఉండాలన్నారు. కొత్తగా లిక్కర్ వ్యాపారంలోకి రావాలనే ఆలోచన వద్దని హితవు పలికారు.
సమస్యలు ఉన్నాయి- కేంద్రం సాయంతో నెట్టుకొస్తున్నాం
గత ప్రభుత్వం చేసిన తప్పులు కారణంగా రాష్ట్రంలో అనేక సమస్యలు ఇంకా ఉన్నాయని తెలియజేశారు చంద్రబాబు. వాటిని సరి చేసుకొని కేంద్ర సాయంతో ముందుకెళ్తున్నామని లీడర్లకు తెలియజేశారు. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం ఉంది కాబట్టే మనం చాలా వరకు నెట్టుకు రాగలుగుతున్నామని తెలిపారు. ఎన్ని కష్టనష్టాలు ఉన్నా అవసరమైనప్పుడు ప్రజలకు అండగా ఉంటున్నామని పేర్కొన్నారు. విజయవాడ వరదల సమయంలో బాధితులకు అండగా ఉన్నామని తెలిపారు.
కూటమిగా వచ్చే ఎన్నికల్లో పోటీ
వచ్చే ఎన్నికల విషయంలో కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో కూడా కూటమిగానే ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు చంద్రబాబు. అందుకే అన్ని పార్టీల నేతలతో సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం, రాష్ట్రం చేస్తున్న మంచి పనులు ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు.
గెలిచాం కాబట్టి ఇప్పుడు అందరిపై బాధ్యత ఉందన్నారు చంద్రబాబు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీల్లో దాదాపు 80 మందికి వరకు కొత్తవారే ఉన్నారని పేర్కొన్నారు. ఎన్ని మనస్పర్థలు ఉన్నా ఓ కుటుంబ పెద్దగా అందరూ కలిసి ఉండాలని కోరుకుంటానని అన్నారు. ప్రజలు ఎదురు ప్రశ్నించే పరిస్థితికి రావద్దని హితవు పలికారు.
వచ్చే ఎన్నికల కోసం ప్రధానమంత్రి మోదీ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారని అలాంటి ఓర్పు సహనం అందరూ అలవర్చుకోవాలని సూచించారు చంద్రబాబు. హర్యానా సీఎం ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రధానమంత్రి ఐదు గంటల పాటు కూర్చున్నారంటే ఆయన ఆలోచన ఏంటో తెలుసుకోవాలన్నారు. సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటా అందర్నీ కలుపుకుంటూ వెళ్తూ మూడోసారి ప్రధానిగా ఆరోసారి సొంత రాష్ట్రంలో పార్టీని గెలిపించారన్నారు. హర్యానాలో కూడా హ్యాట్రిక్ కొట్టారని తెలిపారు. చేసిన ప్రతి పనిలో ప్రజలు కనిపిస్తుంటే కచ్చితంగా ఇలాంటి ఫలితాలే వస్తాయని వివరించారు. ఎక్కడా తప్పు చేయకుండా నేతలతో తప్పు చేయనీయకుండా ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు.
Also Read: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?