Nara Lokesh : రేపు విజయవాడ కోర్టుకు నారా లోకేశ్, ఆ కేసులోనే!
Nara Lokesh : నారా లోకేశ్ రేపు విజయవాడ కోర్టులో హాజరవ్వనున్నారు. అచ్చెన్నాయుడు అరెస్టు సమయంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదు అయింది.
Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విజయవాడ మొదటి అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరుకానున్నారు. రేపు(మే 23) ఉదయం 10.20కి లోకేశ్ కోర్టులో హాజరుకానున్నట్లు తెలుస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించారని లోకేశ్ పై కేసు నమోదు అయింది. ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరవ్వాలన్న ఆదేశాలతో రేపు కోర్టుకు వెళ్లనున్నారు లోకేశ్.
అసలేం జరిగింది?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌పై విజయవాడ సూర్యారావు పేట పోలీస్ స్టేషన్‌లో 2021 జూన్ లో కేసు నమోదయ్యింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ లోకేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టైన సమయంలో పరామర్శించేందుకు సూర్యారావు పేట కోర్టు సెంటర్‌కి నారా లోకేశ్ వచ్చారు. ఈ సమయంలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినట్టు పోలీసులు అభియోగం నమోదు చేశారు. కరోనా తీవ్రంగా ఉన్నందున అంటువ్యాధుల చట్టం ప్రకారం కోవిడ్ వ్యాప్తికి కారణమయ్యారని నారా లోకేశ్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2020 జూన్‌లో ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆయనను విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నప్పుడు 2020 జూన్ 12న రాత్రి 11 గంటల సమయంలో నారా లోకేశ్, కొల్లు రవీంద్ర, పట్టాభి, దేవినేని చందు, జాస్తి సాంబశివరావు మరికొంత మంది నేతలు అక్కడికి వచ్చారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి గుంపుగా ఉండకూడదని వారికి సూచించినా పట్టించుకోలేదని పోలీసులు పేర్కొన్నారు.
కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించటంతో వారిపై జూన్ 12 రాత్రి సూర్యారావుపేట ఎస్ఐ ప్రశాంతి ఫిర్యాదుతో సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా లోకేశ్ తదితరులకు నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన జరిగిన ఏడాది తర్వాత 2021లో కేసు నమోదు చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. కక్షసాధింపులో భాగమేనని దుయ్యబడుతున్నారు. ఈ కేసులో సోమవారం లోకేశ్ విజయవాడ కోర్టులో హాజరు కానున్నారు.
Also Read : JC Prabhakar Reddy : మంత్రుల బస్సు యాత్రపై రాళ్లు పడే అవకాశం, జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు