CM Jagan : బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న సీఎం జగన్, పట్టువస్త్రాలు సమర్పణ
CM Jagan : దసర నవరాత్రుల సందర్భంగా బెజవాడ దుర్గమ్మను సీఎం జగన్ దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.
CM Jagan : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రులు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజు కావడంతో భక్తులు దుర్గమ్మను దర్శించుకునేందుకు పోటెత్తారు. బెజవాడ దుర్గమ్మను సీఎం జగన్ ఆదివారం దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. సరస్వతి దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు.
పంచెకట్టులో ఆలయానికి సీఎం జగన్
పంచెకట్టులో అమ్మవారి దర్శనానికి వచ్చిన సీఎం జగన్ కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చిన్నరాజగోపురం వద్ద సీఎం జగన్ తలకు పరివేష్టం చుట్టారు. అనంతరం అమ్మవారికి ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సీఎంకు అమ్మవారి ప్రసాదం, చిత్ర పటాన్ని అందజేశారు.
దర్శనాలు ఆగకుండా
బెజవాడ దుర్గమ్మకు సీఎం జగన్ ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఇంద్రకీలాద్రికి వచ్చిన సీఎంకు తొలుత పూర్ణకుంభంతో ఆలయ అధికారులు, పండితులు స్వాగతం పలికారు. సీఎం జగన్ ను దుర్గమ్మను దర్శించుకునే సమయంలో సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు, పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించడంతో దర్శనాలు కొనసాగించారు. ఓవైపు సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తుండగా, మరోవైపు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. గతంలో సీఎం దుర్గగుడికి వస్తే రెండు గంటల పాటు దర్శనాలను నిలిపివేసేవారు. ఈసారి సామాన్య భక్తుల దర్శనాలకు ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
మూలా నక్షత్రం కావడంతో భక్తుల రద్దీ
మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి లక్షల్లో భక్తులు పోటెత్తారు. ముఖ్యమంత్రి జగన్ తో పాటు మాజీ మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మంత్రి కొట్టు సత్యనారాయణ స్థానిక నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. కనకదుర్గమ్మకు పసుపు, కుంకుమ, పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం సీఎంకు పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఇంద్రకీలాద్రిపై మొత్తం 12 చోట్ల రోప్ పార్టీలు క్యూలైన్లను పర్యవేక్షిస్తున్నాయి. 500 మంది చొప్పున క్యూలైన్‌లోకి వదులుతూ తొక్కిసలాటకు అవకాశం లేకుండా జాగ్రత్తలు చేపట్టారు. భక్తులను దృష్టిలో పెట్టుకుని విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
సరస్వతి దేవిగా దర్శనం
అమ్మ వారికి అత్యంత ప్రీతికరమైనది మూలా నక్షత్రం. మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రి మీద దేవి సరస్వతిగా దర్శనం ఇస్తుంది. సరస్వతి దేవి జ్ఞానాన్ని అందించే తల్లి. పురాణాలలో సరస్వతిని బ్రహ్మచైతన్య మూర్తిగా ప్రస్తుతించారు. తెల్లని ఈ తల్లి అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగులు ప్రసాదిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి, కాళీదాసు వంటి మహామహులు ఈ తల్లి అనుగ్రహంతో గొప్ప సాధకులుగా ఎన్నటికి వన్నెతరగని సాహిత్యాన్నిప్రపంచానికి అందించారు. విద్యార్థులు ఈ నవరాత్రి వేళలో తల్లిని కొలుచుకోవడం వల్ల విజయాలు సాధిస్తారని నమ్మకం. లలిత కళలకు పట్టపు రాణి సరస్వతి దేవి. తెలుపు రంగు చీరలో అలంకరిస్తారు. హంస వాహనంపై కొలువై ఉంటుంది. ఈ దవళవస్త్రం మానసిక పరిపక్వతతోపాటు సకల విద్యలకు నిదర్శనం. వాక్కు, బుద్ధి, విద్య, జ్ఞానం- వీటి కి అధిష్ఠాత్రి మహా సరస్వతీ దేవి. ''సర్వ విద్యా స్వరూపా యా సా ప దేవీ సరస్వతీ''. సంగీతం, సాహిత్యం, మేధస్సు, ప్రతిభ, స్మృతి, వ్యాఖ్యానం, బోధనాశక్తి, సందేహ నివారణ శక్తి - సరస్వతీ రూపాలే. పరస్పర విరుద్ధంగా కనిపించే వేద పురాణ శాస్త్రాదులను సమన్వయం చేయించే 'సమన్వయ శక్తి' ఈ భారతీ దేవి. వీణాపుస్తక ధారిణి. మల్లెలా, మంచులా, వెన్నెలలా, శుద్ధత్వానికి ప్రతీకగా ధవళ కాంతులతో ప్రకాశించే తల్లి మహా సరస్వతి. తపస్వుల తపశ్శక్తి. సిద్ధి స్వరూపిణి. వాగ్దేవి, వాణీదేవి, శారదాదేవి, బ్రాహ్మీ. ఈ తల్లి దయవల్లే మాటలు, మేధస్సు సమకూరుతాయి. కనుక 'సరస్వతీ కటా క్షం' మనం యాచించాలి.
Also Read : Dussehra 2022: అష్టదరిద్రాల తీర్చే మహాగౌరి, దుర్గాష్టమి రోజు నవదుర్గల్లో ఎనిమిదవది మహాగౌరి
Also Read: శరన్నవరాత్రుల్లో పాడ్యమి నుంచి దశమి వరకూ అమ్మవారికి రోజుకో రంగు ప్రత్యేకం