Ratan Tata: రతన్ టాటాకు నచ్చిన 'కడియం' కుర్రాడు - ఏడేళ్లుగా ఈ మెయిల్ పరిచయం, మూడుసార్లు భేటీ
East Godavari News: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా తూ.గో జిల్లా కడియంకు చెందిన ఓ యువకున్ని అమితంగా ఇష్టపడ్డారు. వారి పరిచయం వెనుకున్న అసలు కథ ఏంటో తెలుసా.!
Ratan Tata Likes Kadiyam Young Man: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాను (Ratan Tata) స్వయంగా చూసిన వారే అరుదు. ఇక ఆయనతో కలిసి ఫోటో తీయించుకోవడం అంటే పెద్ద అదృష్టంగా భావిస్తుంటారు. అలాంటి ప్రపంచ పారిశ్రామిక దిగ్గజం తూర్పుగోదావరి జిల్లా కడియంకు (Kadiyam) చెందిన ఓ పాతికేళ్ల కుర్రాడిని ఇష్టపడ్డారు. రతన్ టాటాకు ఉన్న ఎన్నో విభిన్నమైన అభిరుచులకు దగ్గరగా ఉండడమే ఈ కుర్రాడి ప్రత్యేకత. ఆ విభిన్న శైలితోనే ఆయనకు ఇష్టుడయ్యాడు. ఏడేళ్లుగా వారిరువురూ ఈ మెయిల్ మెసేజ్‌ల ద్వారా పరిచయాలు పెంచుకున్నారు. రతన్ టాటా అభిరుచులకు అనుగుణంగా ఈ కుర్రాడు మెసేజ్‌లు, బొమ్మలు పంపించడం కూడా ఇందుకు కారణం.
రతన్ టాటా - పర్యావరణ ప్రేమికులు
రతన్ టాటా అంటే పారిశ్రామంగా అభివృద్ధి చెందడంతో పాటు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం గురించే మనందరికీ తెలుసు. కాని వీటితో పాటు పర్యావరణం అంటే ఈయనకు పట్టరాని అభిమానం. ఈ సృష్టిలో ప్రతి జీవరాశి సుఖంగా జీవించాలనే ఆలోచనతో ఉంటూ.. అందుకు తగిన సహాయ సహకారాలు అందించారు. అంతరించిపోతోన్న ఎన్నో జాతుల మనుగడకు పాటుపడ్డారు. అయితే కడియం మండలం కడియపులంక గౌతమి నర్సరీ యువ రైతు మార్గాని వెంకట శేషు (Venkata Seshu) ఎంబీఏ చదువుకునే సమయంలో అన్ని రంగాల్లోనూ రతన్ టాటా ఉండడాన్ని గుర్తించారు. దీంతో అసలు రతన్ టాటా అభిరుచులు ఏంటి అనే దానిపై ఆరా తీశారు. ఆయన మొక్కలతో పాటు పశుపక్ష్యాదులపై ఎలాంటి అభిమానాన్ని చూపెడతారనేది అవగాహన చేసుకున్నారు.
స్నేహంగా మార్చిన సందేశం
దీంతో రతన్ టాటా అభిరుచులకు అనుగుణంగా కొన్ని కొటేషన్లను తయారు చేసి ఆయన పర్సనల్ ఈ - మెయిల్‌కు శేషు మెసేజ్ చేస్తుండేవారు. 2017 నుంచి ఈ మెసేజ్‌లు పంపడం ప్రారంభించారు. వాటిల్లో కొన్ని నచ్చడంతో పర్సనల్ సెక్రటరీలు రతన్ టాటాకు చూపించడం మొదలుపెట్టారు. అలా కొద్ది రోజులు గడిచేసరికి ఆయన్ను మరింత ఆకట్టుకునేలా కొన్ని బొమ్మలు వేయించి ఈ యువకుడు పంపించారు. అవి రతన్ టాటాకు అమితంగా నచ్చాయి. అందుకనే వెంకటశేషు పంపే మెసేజ్‌లు, బొమ్మలను తరచూ చూస్తూ ఉండేవారు. ఈ క్రమంలో ఆయన్ను స్వయంగా కలవాలనే శేషు కోరికను గమనించి రతన్ టాటా పరివేక్షక బృందం అవకాశం ఇచ్చారు. శేషు పుట్టినరోజున ఆయన ఆశీస్సులు తీసుకునే అదృష్టం కలిగింది. ముంబయిలోని రతన్ టాటా బంగ్లాలో ఆయన్ను కలిసేందుకు 2 నిమిషాలు అవకాశం రాగా.. కలిసిన తర్వాత ఆ సమయం గంటగా మారింది.
చిన్న వయసులో రతన్ టాటా అభిరుచులకు అనుగుణంగా ఉండడం వల్ల తనను ఎంతగానో అభిమానించారని శేషు తెలిపారు. రెండు ఏళ్ల క్రితం మా అమ్మానాన్నలు మిమ్మల్ని చూడాలని కోరుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లగా వెంటనే అవకాశం కల్పించారన్నారు. అయితే తల్లిదండ్రులు వీరబాబు, సత్య లు రావాల్సిన విమానం అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. దీంతో ఆయన మాకు ఇచ్చిన సమయానికి వెళ్లలేని పరిస్థితి. అయితే ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా గంటన్నర ఆలస్యం అయినప్పటికీ వారిని కలుసుకునే అవకాశం ఇచ్చారు. ఇటువంటి కుమారుడు ఉండటం మీ అదృష్టమని తనను కొనియాడారని శేషు తెలిపారు. ఇదిలా ఉండగా ఆయన డ్రై ఫ్రూట్ లడ్డూలను ఇష్టంగా తింటారని తెలిసి మా అమ్మతో తయారు చేయించి పంపించగా వాటిని తిని బాగున్నాయని మెసేజ్ పంపినట్లు తెలిపారు.
ఈ జనవరిలో రతన్ టాటాను కలిసినప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని ఆయన అనారోగ్యానికి గురయ్యారనే వార్తలు రావడంతో ఆయన కార్యాలయానికి ఫోన్ చేసి అడగ్గా త్వరలోనే కోలుకుంటున్నారని చెప్పారని ఇంతలో ఇలా జరగడం బాధాకరమని శేషు తెలిపారు. ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన ఆశయాలు సజీవంగా ఉంటాయని.. ఆయన లేని లోటు తనకు, తమ కుటుంబానికి తీరనిదని శేషు కన్నీటి పర్యంతమయ్యారు.
Also Read: Ratan Tata: రతనా టాటా పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ నివాళి