Vangalapudi Anitha: "దిశ చట్టం ఒక దిక్కుమాలిన చట్టం - పట్టపగలే ఏపీలో ఆడపిల్లలకు రక్షణ లేదు"
Vangalapudi Anitha: దిశ చట్టం ఓ దిక్కుమాలిన చట్టం అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. పట్టపగలే రాష్ట్రంలో అమ్మాయిలకు భద్రత లేకుండా పోయిందన్నారు.
Vangalapudi Anitha: దిశ చట్టం ఒక దిక్కుమాలిన చట్టం అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత పైర్ అయ్యారు. కేసులు మాఫీ చేసుకోవడానికి కాళ్లు పట్టుకోవడానికే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలోని ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా దగ్గరకు వెంకటేశ్వరస్వామి ఫొటోలు, శాలువాలు పట్టుకుని వెళ్తున్నారని ఆరోపించారు. అమ్మాయిలకు న్యాయం చేయలేని దిశ చట్టం అనేది ఓ దిక్కుమాలిన చట్టం అని, ఇంకా దానికొక దిశ పోలీస్ స్టేషన్ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. దిశ యాక్ట్ మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే పరిస్థితి లేదన్నారు. ఆడపిల్ల మీద చెయ్యి పడితే చెయ్యి నరకాలన్న దానిపై దృష్టి పెట్టి ఉంటే భయపడే పరిస్థితి ఉండేదని వంగలపూడి అనిత వివరించారు. రాష్ట్రంలో ఆడబిడ్డ బ్రతుకు గురించి మాట్లాడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆడబిడ్డకు న్యాయం జరగాలనే బాధితురాలి గురించి మాట్లాడాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. ఆంధ్ర ప్రదేశ్‌లో పట్టపగలు ఆడపిల్లలకు రక్షణ లేని పరిస్థితి ఉందన్నారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చిర్రయానాంలో సర్పంచ్ కుమారుడు, అతని స్నేహితులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడడం దారుణం అని చెప్పారు. వీరంతా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ అనుచరుల పిల్లలే అని ఆరోపించారు. బయట ప్రపంచానికి తెలయకుండా ఇంత పెద్ద సంఘటనను డబ్బు రూపంలో కొనేందుకు ప్రయత్నించి దాచి పెట్టారని గుర్తు చేశారు. హోమ్ మినిష్టర్ తానేటి వనిత మహిళ అయి ఉన్న ఈ ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్ జరిగిన సంఘటన బయటి ప్రపంచానికి తెలయడానికే పది రోజుల సమయం పట్టిందని ఎద్దేవా చేశారు. బాధితురాలికి వైసీపీ ప్రభుత్వం న్యాయం చేయాలని.. వారి కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులకు, ఈ సంఘటనను కప్పిపుచ్చాలని ప్రయత్నించిన వైసీపీ పెద్దలను కఠినంగా శిక్షించాలని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. మహిళా పోలీస్, ఎస్సై, వీఆర్వో వీళ్లందరినీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలితో మాట్లాడాలని వెళితే ఆ బిడ్డను దాచి పెట్టారని.. కనీసం రెండు నెలలకైనా నిందితులకు శిక్ష వేయించండని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే..?
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక.. ఈనెల 6వ తేదీన బట్టలు ఉతికేందుకు తీరప్రాంతంలో ఉన్న సరుగుడు తోటల మధ్యకు వెళ్లింది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన ఐదుగురు యువకులు ఆమె వెంటే వెళ్లారు. ఆ బాలికతో మాట కలిపారు. మాయ మాటలు చెప్పి పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఐదుగురూ కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారంతా అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర అస్వస్థతతకు గురైన బాలిక అతి కష్టంగా ఇంటికి చేరుకుంది. అయితే బాలిక అలా ఉండడంతో ఏమైందని ప్రశ్నించిన తల్లిదండ్రులకు అసలు విషయాన్ని తెలిపింది. అయితే అత్యాచారానికి పాల్పడ్డ ఐదుగురు యువకులలో అధికార పార్టీకి చెందిన నాయకుల కుమారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దారుణానికి పాల్పడిన నిందితులు బాధిత కుటుంబాన్ని బెదిరించడం మొదలు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు.