Amaravati: అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Andhra News: అమరావతి అభివృద్ధికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. రూ.15 వేల కోట్ల నిధుల వినియోగంపై పలు సూచనలు చేసింది.
AP Government Orders On Amaravati Funds Usage: ఏపీ రాజధాని అమరావతి (Amaravati) ప్రాంత అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. నగర నిర్మాణం, సుస్ధిరాభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు (World Bank), ఆసియా అభివృద్ధి బ్యాంకులు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వరల్డ్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకులు కలిసి సంయుక్తంగా రూ.15 వేల కోట్ల రుణ సహకారాన్ని అందించనున్నట్లు తెలిపింది. ఈ నిధులతో రాజధానిలో అత్యున్నత ప్రమాణాలతో మౌలిక వసతులు, హరిత నిర్మాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేలా కార్యాచరణ చేపట్టాలని పేర్కొంది. ఈ మేరకు అమరావతి అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికలు అమలు చేయాలని సీఆర్డీఏను (CRDA) ఆదేశించింది. ప్రధాన రహదారులు, డక్ట్‌లు, డ్రెయిన్లు, వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా కాలువలు, నీటి రిజర్వాయర్లు, సురక్షిత తాగునీరు వంటి సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులను చేపట్టాలని నిర్దేశించింది.
ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఏముంది.?
రాజధాని అమరావతి సుస్థిరాభివృద్ధికి ఏపీ సీఆర్డీఏ ప్రతిపాదనలు సమర్పించగా.. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఆమోదించిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రతిపాదనలకు వరల్డ్ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకులు కూడా ఆమోదం తెలిపి అమరావతి నగర నిర్మాణం అభివృద్ధికి చెరో 800 మిలియన్ డాలర్ల మేర ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. మిగతా నిధులను కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ సంస్థల నుంచి సాయం పొందేందుకు ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌కు అధికారం కల్పిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
నిధులు పొందేందుకు స్పెషల్ అకౌంట్
అమరావతి అభివృద్ధి, ప్రణాళికల ఆధారంగా దశల వారీగా బ్యాంకుల నుంచి నిధులు పొందేందుకు ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని నిర్మాణ ప్రణాళికల కోసం బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులతో పాటు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఏపీ సీఆర్డీఏ కమిషనర్ ఆధీనంలోనే అభివృద్ధి, నిర్మాణ ప్రణాళికలు అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో సోమ, మంగళవారాల్లో ఢిల్లీ ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రుణ సహకారంపై సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని ఒప్పందం కుదుర్చుకోనున్నారు.
'మున్సిపల్ శాఖలో నూతన సంస్కరణలు'
మరోవైపు, మున్సిపల్ శాఖలో నూతన సంస్కరణలకు మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఉత్తమ విధానాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చామని అన్నారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు, బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన ఆదివారం సమావేశమయ్యారు. అన్ని శాఖల సర్వర్లను అనుసంధానం చేసి.. డిసెంబర్ నుంచి నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. 2014 - 19లో భవన నిర్మాణ అనుమతులకు ఆన్‌లైన్ విధానం తీసుకొస్తే.. గత వైసీపీ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసిందని అన్నారు. టౌన్ ప్లానింగ్ అప్రూవల్ సిస్టంపై అధ్యయనం చేసి.. కొత్త సంస్కరణలు తెస్తున్నామని చెప్పారు. మున్సిపల్ శాఖ సర్వర్లతో అన్ని శాఖల సర్వర్లను అనుసంధానం చేసి వెబ్‌సైట్ ద్వారానే అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.