TTD EO: తిరుమలకు వెళ్లే భక్తులకు ఇబ్బంది లేదు.. మెుదటి ఘాట్ రోడ్డులో వాహనాలు నడుస్తున్నాయి
తిరుపతి, తిరుమల నడుమ ప్రయాణించే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదని.. టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన కారణంగా.. ఓ ప్రకటన విడుదల చేశారు.
తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేవని.. టీటీడీ ఈవో జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం రోజున.. రెండో ఘాట్‌రోడ్‌లో 13వ కి.మీ వద్ద, 15వ కి.మీ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయని అన్నారు. ఈ కారణంగా రక్షణ గోడలు, రోడ్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. అయితే.. వీటి పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని జవహర్ రెడ్డి చెప్పారు. బండరాళ్లు, మట్టిని పూర్తిగా తొలగిస్తామన్నారు.
మొదటి ఘాట్ రోడ్‌లో వాహనాలు నడుస్తున్నాయని జవహర్ రెడ్డి చెప్పారు. సాయంత్రం 4గంటల వరకు తిరుపతి నుంచి తిరుమలకు 2,300 వాహనాలు వెళ్లాయన్నారు. అలాగే తిరుమల నుంచి తిరుపతికి 2 వేల వాహనాల వరకు ప్రయాణించాయని చెప్పారు. ఐఐటీ నిపుణులు.. పరిశీలించి.. సమర్పించే నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామన్నారు. భక్తులకు ఘాట్‌రోడ్‌లో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని.. అధికారులను ఈవో ఆదేశించారు.
ఘాట్ రోడ్డులో నిలిచి పోయిన వాహనాలను లింక్ రోడ్డు గుండా తిరుమలకు అనుమతించారు. మొదటి ఘాట్ రోడ్డు నుండే తిరుమలకు వాహనాలను అనుమతి ఇస్తున్నారు. అయితే తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే వాహనాలు ఒక గంట, తిరుమల నుండి తిరుపతికి వచ్చే వాహనాలకు మరో గంట పాటు అనుమతిస్తూ ఒకే ఘాట్ రోడ్డులో వాహనాలను అధికారులు అనుమతిస్తున్నారు.
వర్షాలు కురిసే సమయంలో తరచూ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడే అవకాశం ఉండడంతో ఢిల్లీ నుండి ఐటీ నిపుణులను రప్పించి కొండచరియలు విరిగి పడే ప్రాంతాలను పరిశీలించి ఓ నివేదిక ఇవ్వాలని అధికారులను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు.
మరమ్మతులకు కొన్ని రోజులు పట్టే అవకాశం ఉండటంతో దర్శన టిక్కెట్లు ఉన్న భక్తులు తేదీలను మార్చుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఆన్‌లైన్‌లో దర్శన టిక్కెట్లు పొందిన భక్తులకు మరో ఆరు నెలల వరకూ దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. రెండో ఘాట్ రోడ్డును మరమ్మత్తులు చేసేందుకు మరో నాలుగు రోజుల సమయం పట్టే పరిస్ధితి కనిపిస్తుందని అధికారులు చెబుతున్నారు.
Also Read: తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు.. శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
Also Read: రెండున్నరేళ్ల టర్మ్ పూర్తి ! ఏపీలో కొత్త కేబినెట్ ముహుర్తం ఎప్పుడు ?
Also Read: ఏపీకి మరో ముప్పు.. దూసుకొస్తున్న 'జవాద్' సైక్లోన్ .. ఎక్కడుందో లైవ్ చూడండి!
Also Read: ఏపీలో "ఓటీఎస్" దుమారం ! అసలేంటి ఈ పథకం ? ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు ?