AP News Developments Today: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పర్యటన సహా కీలకమైన అప్‌డేట్స్ ఇవాళ చూడొచ్చు
AP News Developments Today: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన సహా కీలకమైన అప్‌డేట్స్ ఇవాళ చూడొచ్చు.
నేడే నేవీ డే ఉత్సవాలు
భారత నౌకాదళ దినోత్సవం ఇవాళ విశాఖలో ఘనంగా జరగనుంది. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ ఈ ఉత్సవాలు జరుగుతాయి. విశాఖలోని ఆర్కే బీచ్ లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతారు. నేవీ డే కోసం కొన్నిరోజులుగా ఇండియన్ నేవీ విన్యాసాలతో రిహార్సల్స్ చేస్తుంది.1971 లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా నేవీ డే ను ప్రతి ఏడూ డిసెంబర్ 4న ఘనంగా జరుపుతోంది భారత ప్రభుత్వం. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా నేవీ డే ఉత్సవాలు జరగలేదు. ఈ నేపథ్యంలో రెండేళ్ల గ్యాప్ తరువాత జరుగుతున్న నేవీ డే ను చూడడానికి ప్రజలు సైతం ఉత్సాహంగా ఉన్నారు.
నేడు రాష్ట్రానికి రాష్ట్రపతి -రెండు రోజులు ఏపీలోనే
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు ఏపీకి వస్తున్నారు. రాష్ట్రపతి హోదాలో తొలిసారి ఏపీకి వస్తున్న ఆమెకు విజయవాడలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆహ్వానం పలుకుతారు. ఉదయం 10:50 కి గన్నవరం విమానాశ్రయం చేరుకునే ఆమె 11:25 నుంచి 12:15 వరకూ పోరంకి లోని మురళి కన్వేషన్ హాల్ లో జరిగే పౌర సన్మానం కార్యక్రమంలో పాల్గొంటారు. తరువాత రాష్ట్రపతి గౌరవార్ధం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ ఏర్పాటు చేసిన అధికారిక విందులో ద్రౌపది ముర్ము మధ్యాహ్నం 1 నుంచి 2:15 వరకూ పాల్గొంటారు. సీఎం జగన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. మధ్యాహ్నం 2:35 కు విజయవాడ నుంచి బయలుదేరి 3:25 కు విశాఖ లోని నేవెల్ ఎయిర్ స్టేషన్ INS డేగా కు చేరుకుంటారు. అక్కడి నుంచి 4 గంటలకు నేవీ డే లో పాల్గొనడానికి ఆర్కే బీచ్ కు బయలుదేరి వెళతారు. నేవీ డే సంబరాల అనంతరం ఆమె రాత్రి 8 గంటలకు తిరుపతి బయలుదేరి వెళతారు. రేపు తిరుపతిలో రాష్ట్రపతి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.