YSRCP News: మారిన రాప్తాడు సిద్ధం సభ షెడ్యూల్! ఈ నెల 18న నిర్వహణ
Raptadu Siddham Schedule: అనివార్య కారణాలవల్ల ఈ సభను ఈనెల 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.
Raptadu YSRCP Siddham Schedule: అధికార వైసీపీ రాయలసీమలో నిర్వహించ తలపెట్టిన మూడో సిద్ధం సభ వాయిదా పడింది. ముందుగా ఈనెల 11వ తేదీన సిద్ధం సభ రాప్తాడు నియోజకవర్గంలో నిర్వహించాలని వైసీపీ నాయకులు భావించారు. అనివార్య కారణాలవల్ల ఈ సభను ఈనెల 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. తేదీ మాత్రమే మారిందని, మిగతాదంతా యధా ప్రకారం సదస్సు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత ప్రాంతం రాయలసీమలో నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో వైసీపీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికలకు కేడర్ ను సమాయత్తం చేసేందుకు సిద్ధం పేరుతో వైసీపీ సభలను నిర్వహిస్తోంది.
తొలి సభను ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ పరిధిలోని సంగివలసలో నిర్వహించగా, రెండో సభను ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించి ఏలూరు పరిధిలోని దెందూలూరు నియోజకవర్గం దగ్గరలో నిర్వహించారు. రెండు చోట్ల భారీ ఎత్తున కేడర్ హాజరు కావడంతో సభలు గ్రాండ్ సక్సెస్ అయినట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు. మూడో సభను సీఎం జగన్మోహన్‌రెడ్డి సొంత అడ్డాగా చెప్పుకునే రాయలసీమలో వైసీపీ నిర్వహిస్తోంది. రాయలసీమలోని అనంతపురం జిల్లా పరిధిలోని రాప్తాడు నియోజకవర్గంలో ఈ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 5 లక్షల మంది ఈ సభకు వస్తారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. రాప్తాడు మండల కేంద్రంలోని ఆటో నగర సమీపంలో రాయలసీమ స్థాయలో సిద్ధం సభను నిర్వహిస్తున్నారు.
వాయిదా వేసినట్లు ప్రకటించిన మంత్రి పెద్దిరెడ్డి
సిద్ధం సభను ఈనెల 11న నిర్వహించాలని ముందుగా వైసీపీ నాయకులు భావించారు. కానీ అనూహ్యంగా సభ నిర్వహిస్తున్న తేదీని మారుస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. తేదీ మాత్రమే మారిందని.. సభ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ అలాగే ఉంటుందన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి 1.30 గంటలకు సభ వేదిక వద్దకు చేరుకుంటారని మంత్రి వెల్లడించారు. గడిచిన ఎన్నికల్లో మూడు స్థానాలు మినహా రాయలసీమలోని అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేస్తుందని, వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీట్ చేసేందుకు దోహదం చేసేలా ఈ సభను నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత ప్రాంతమైన రాయలసీమలో సభను గ్రాండ్ సక్సెస్ చేయడం ద్వారా.. మిగిలిన ప్రాంతాల్లోని కేడర్ కు మరింత భరోసాను కల్పించేందుకు దోహదం చేస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు.
గురువారం సిద్ధం సభ జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. జోరుగా పనులు పూర్తి చేయాలని స్థానిక నాయకులకు ఆదేశించారు. రెండు రోజుల కిందట సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసిల రఘురాం, స్థానిక ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తదితరులు ఏర్పాటును పరిశీలించి నిర్వాహకులు తగిన ఆదేశాలను జారీ చేశారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఏర్పాట్లు పరిశీలించారు.