Chevireddy Bhaskar Reddy Arrest: బెంగళూరులో చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, లుకౌట్ నోటీసుల ఎఫెక్ట్!
వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లుకౌట్ నోటీసులు జారీ కావడంతో బెంగళూరు ఎయిర్‌పోర్టులో చెవిరెడ్డిని అడ్డుకున్నారు.

బెంగళూరు: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డిపై లుకౌట్ సర్క్యులర్ ఉండటంతో బెంగళూరు విమానాశ్రయంలో చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి శ్రీలంక రాజధాని కొలంబో వెళ్ళేందుకు సిద్ధమైన చెవిరెడ్డిని విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకొని, ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారని సమాచారం. ఏపీ సిట్ అధికారులు బెంగళూరుకు వెళ్లి, చెవిరెడ్డిని విజయవాడకు తీసుకురానున్నారు. సిట్ కార్యాలయంలో విచారణ తరువాత మేజిస్ట్రేట్ ఎదుట చెవిరెడ్డిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
లిక్కర్ స్కాంపై చంద్రబాబు ఏమన్నారంటే..
వైసీపీ హయాంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసును కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు నిష్పక్షిపాతంగా దర్యాప్తు చేస్తున్నాయని సీఎం చంద్రబాబు ఇటీవల స్పష్టం చేస్తున్నారు. కేబినెట్ భేటీలో సైతం లిక్కర్ స్కాంపై చర్చ జరిగింది. ఈ అంశంపై ఎవరూ స్పందించాల్సిన అవసరం లేదన్నారు. విచారణ బృందానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చామన్నారు చంద్రబాబు. ఇందులో పలువురు వైసీపీ నేతలు, వ్యాపార ప్రముఖుల హస్తం ఉందని పోలీసులు గుర్తించారు.
లిక్కర్ స్కాం జరిగిందని సీఐడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని రోజులకిందట ఈ కేసులో మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులు అయిన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలను అరెస్టు చేశారు. భారతీ సిమెంట్స్ లో కీలక వ్యక్తి సైతం అరెస్టయ్యారు.
లిక్కర్ స్కాం కేసులో రాజ్ కెసిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మొత్తం అతడే చేశాడని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. పోలీసుల విచారణకు పిలిస్తే వెళ్లి తనకు తెలిసిన విషయాలు మాత్రమే చెప్పానన్నారు. వైసీపీ నేతలు చెప్పినట్లు వారిని ఇరికించే ఉద్దేశం తనకు లేదని, పోలీసులు సాక్ష్యాధారాలతో కేసు దర్యాప్తు చేస్తారని పేర్కొన్నారు. తనపై ఉద్దేశపూర్వకంగా కామెంట్లు చేస్తే మాత్రం ఎవరినీ వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన చెవిరెడ్డి గన్‌మన్ మదన్..!
లిక్కర్ కేసులో విచారణ పేరుతో సిట్ అధికారులు తనపై దాడి చేశారని చెవిరెడ్డి గన్‌మన్ మదన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. స్టేట్‌మెంట్ ఇవ్వాలంటూ తనపై ఒత్తిడి చేశారని పిటిసన్‌లో మదన్ పేర్కొన్నాడు. తన పిటిషన్ విచారణకు లాయర్‌ను అనుమతించాలని హైకోర్టును కోరాడు.






















