Madanapalle: నా మొగుడు నాకే కావాలి, భర్త కోసం భార్యలు ఆత్మహత్యాయత్నం
Annamayya District News: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో భర్త కోసం ఇద్దరు భార్యలు ఆత్మహత్యకు యత్నించిన ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
Madanapalle: భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఎంతో కీలకమైనది. దీనికి మూలమైన వివాహ వ్యవస్థ పట్ల ఎంతో గౌరవం ఉంది. కుటుంబ పెద్దలు, చట్టం అంగీకారంతో స్త్రీ, పురుషుడు ఒకరినొకరు ఇష్టపడి కలిసి జీవించడం.. వారి మధ్య సామాజిక బంధానికి రూపమే పెళ్లి. ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలతో వివాహం జరుపుకుంటారు. అయితే ఇటీవల వివాహ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే జరుగుతుంది.. అది అందరికీ గుర్తుండిపోయేలా ఉండాలని సంప్రదాయాల ప్రకారం ఎంతో అట్టహాసంగా చేసుకుంటారు. ఇటీవల కాలంలో వాటన్నింటిని తుంగలో తొక్కి తమ ఇష్టానుసారంగా జరుపుకుంటున్నారు. మాంగల్యధారణ, సప్తపది, అరుంధతీ నక్షత్రం వంటి సంప్రదాయాలు హిందూ వివాహ వ్యవస్థలో చాలా ముఖ్యమైనవి. ఇవి లేకుంటే అసలు పెళ్లి జరిగేది కాదు. అప్పటి వరకూ పరిచయం లేని రెండు జీవితాలను మూడు ముళ్లతో ఒక్కటి చేసేదే పెళ్లి. అందుకే పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు చెప్తుంటారు. భర్తను దక్కించుకునేందుకు, తమకు న్యాయం చేయాలని కోరుతూ ఇద్దరు భార్యలు ఆత్మహత్యాయత్నం చేశారు. అన్నమయ్య జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ఒకరికి తెలియకుండా మరొకర్ని పెళ్లి
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని చంద్రకాలనీకి చెందిన రెడ్డి శేఖర్ అనే వ్యక్తి.. మదనపల్లె టమాటా మార్కెట్లో పని చేస్తుంటాడు. అతడికి దుర్గమ్మ అనే మహిళతో మొదట పెద్దల సమక్షంలో పెళ్లి అయింది. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో చేసుకున్నాడో తెలియదు కానీ.. లక్ష్మీ అనే మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పెళ్లాలకు విషయం తెలియకుండా కొన్నిరోజులు.. రెడ్డి శేఖర్ సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరు భార్యలకు అసలు నిజం తెలిసిపోయింది. అప్పటి దాకా తన భర్త అని భావించిన భార్యలు, మరో పెళ్లి చేసుకున్నాడని తెలిసి మహిళలు గొడవకు దిగారు. నా మొగుడు నాకే కావాలి అంటూ ఇద్దరూ గొడవ పడ్డారు. భర్తను దక్కించుకునేందుకు ఆత్యహత్యాయత్నం చేశారు.
ప్రాణాలైనా ఇస్తాం కానీ..
నా భర్త నాకే కావాలంటూ దుర్గ.. లేదు నా మొగుడు నాకే సొంతం అంటూ లక్ష్మీ గొడవ పెట్టుకున్నారు. చివరకు భర్త కోసం ప్రాణాలను సైతం వదులుకునేందుకు రెడీ అయిపోయారు. గొడవ తర్వాత ఇద్దరూ కూడా పురుగులమందు తాగారు. అయితే వెంటనే గమనించిన కుటుంబసభ్యులు ఇద్దరినీ.. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి క్షేమంగానే ఉందని సమాచారం. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. మదనపల్లె టూటౌన్ పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. భర్త కోసం గొడవ పడి పురుగులమందు తాగిన ఇద్దరు భార్యలు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే భర్త ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లాడినప్పటికీ ఆ భార్యలు ఇద్దరూ తమకు అతనే కావాలని కోరుకుంటున్నారు. తమ ప్రాణాలనైనా వదులుకోవడానికి సిద్ధపడ్డారు కానీ.. మోసం చేసిన భర్తను వదిలేయాలని భావించలేదు. అది తాళికి, పెళ్లికి ఉన్న మన దేశంలో ఉన్న గొప్పదనం అంటూ స్థానికులు కామెంట్ చేస్తున్నారు.