Punganur constituency: పుంగనూరులో రామచంద్ర యాదవ్ నిలుస్తారా? బీసీవై పార్టీని గమ్యానికి చేరుస్తారా?
BCY Party: పుంగనూరు నియోజకవర్గం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి కంచుకోట. అలాంటి కంచుకోటలో ఆయన్ని ఢీ కొడుతున్నారు రామచంద్రయాదవ్. ఇంత ఫైట్ చేస్తున్న ఆయన గమ్యానికి చేరుకుంటారా?
Andhra Pradesh News: రాష్ట్ర రాజకీయాలులో అనుకోని విధంగా చర్చలో నిలిచిన వ్యక్తి రామచంద్ర యాదవ్. గత ఐదు సంవత్సరాల వరకు తన సొంతూరికే పరిమితమైన వ్యక్తి... 2019 ఎన్నికల్లో పోటీ చేసి నియోజకవర్గానికి పరిచయమయ్యారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో రాష్ట్ర స్థాయిలో చర్చనీయమైన వ్యక్తిగా మారారు ఆయన. ఆయన సొంతంగా పార్టీ పెట్టి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసేందుకు ముందుకు సాగుతున్నారు.
పుంగనూరు నియోజకవర్గం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి కంచుకోట. ప్రతి గ్రామంలో పెద్దిరెడ్డి చెప్పిందే శాసనం. ఆయన ఇంటికి వెళ్తే జరగని పని అంటూ లేదని ఇక్కడి ప్రజలు అంటూ ఉంటారు. అలాంటి రాజకీయ చానుక్యుడే టార్గెట్‌గా రాజకీయ మాటలు తో యుద్ధం చేస్తున్నాడు రామచంద్ర యాదవ్. ఆ ఒక్క నియోజకవర్గమే కాదు ఏకంగా ప్రత్యేక పార్టీ పెట్టి రాష్ట్ర రాజకీయాల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు.
గత ఎన్నికల్లో...
రామచంద్ర యాదవ్ ఓ సాధారణ కుటుంబలో పుట్టారు. 2019 ముందు వరకు వ్యాపారవేత్తగా ఉన్నారు. ఆ ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడే రూ.2000 కూపన్లు పంచారని.. తాను గెలుపొందిన తరువాత వాటిని తెస్తే బహుమతులు తీసుకెళ్లొచ్చని ప్రచారం చేసినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గంలో ఓటమిపాలైయ్యారు. ఆ తర్వాత కొన్ని నెలల పాటు సైలెంట్‌గా ఉన్న రామచంద్ర యాదవ్ ఒక్కసారిగా నియోజకవర్గంలోనే కాదు యావత్ రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారారు.
పుంగనూరులో కోట్ల రూపాయలతో నిర్మించిన ఇంటి గృహప్రవేశం 30 రోజులపాటు జరిపించారు. ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యారు. ఈ ఒక్క ఘటనతో రామచంద్ర యాదవ్ పేరు మారుమోగింది. యోగా గురువు రాందేవ్ బాబా సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంతలా సంపద, ప్రముఖల స్నేహం ఉన్న ఆయన చేసే వ్యాపార ఇంత వరకు ఎవరికీ తెలియదు.
రామచంద్ర రెడ్డి వర్సెస్ రామచంద్ర యాదవ్
క్రమంగా పుంగనూరులో సీన్ మారిపోయింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోనే ఆయన ఢీ కొట్టారు. జనసేన నుంచి బయటకు వచ్చిన తర్వాత స్పీడ్ పెంచారు. పెద్దిరెడ్డి అన్యాయాలు, అక్రమాలు చేస్తున్నారని అభివృద్ధి అనేది లేదంటూ ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇది పెద్దిరెడ్డి వర్గీయుల్లో కోపానికి కారణమైంది. అంతే పెద్దిరెడ్డి మద్దతుదారులు భారీ ఎత్తున రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి చేసి కలకలం సృష్టించారు. దీన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నారాయన. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసి ఫిర్యాదు చేశారు. ఏకంగా జడ్ ప్లస్ క్యాటగిరి తెచ్చుకున్నారు.
ఇలా మొదలైన రామచంద్ర యాదవ్ పోరాటం క్రమంగా తీవ్రరూపం దాల్చింది. నియోజకవర్గంలో పెద్దిరెడ్డి టార్గెట్‌గా ఉద్యోగ మేళా, ప్రాజెక్టుల పరిశీలన, పర్యటనలు చేసేందుకు యత్నించారు. అన్నింటిలో ఎదురుదెబ్బలే తగిలాయి. కానీ ప్రచారంలో నిలిచారు. ఏకంగా భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) పేరుతో పార్టీ ప్రకటించారు. ఇప్పుడు అదే పార్టీ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్ధులను నిలబెట్టబోతున్నారు.
పుంగనూరు నుంచి గెలవాలని సంకల్పం
ఎలాగైన పుంగనూరు నుంచి విజయం సాధించాలని రామచంద్ర యాదవ్ సంకల్పించుకున్నారు. అందుకే పెద్దిరెడ్డి లోపాలు గుర్తించి వాటిపై ఫోకస్ పెట్టారు. పుంగనూరులో కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయని వాటికి చెక్ పెడితే పుంగనూరులో విజయం పెద్ద విషయం కాదని భావిస్తున్నారు. అందుకే ఎన్నికల్లో అక్రమాలు జరిగే ప్రాంతాలను గుర్తించి వాటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల టైంలో జరిగిన విషయాలను వారికి రిపోర్ట్ చేశారు. దీంతో నియోజకవర్గంలో 182 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించింది ఈసి. వాటిలో లైవ్ స్ర్టీమింగ్‌కు ఆదేశాల జారీ చేసింది. ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ సరళిని వీడియో రికార్డింగ్ చేస్తారు. సీసీ టీవీ రికార్డింగ్ చేస్తారు. కాని సమస్యాత్మక ప్రాంతాలు, వనరబుల్ ప్రాంతాల్లో మాత్రమే లైవ్ స్ర్టీమింగ్ నిర్వహిస్తారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలతోపాటు లైవ్ స్ర్టీమింగ్ నిర్వహించే వాటిలో పుంగనూరు అధికంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గంలో ఎవరు బలాబలాల ఏంటో.. ప్రజలు నిర్ణయం ఎటువైపో చూడాలి.