TTD NEWs: శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా ? - ఇవి తెలుసుకోండి
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలు ఇవిగో
TTD NEWs: కరోనా తర్వాత తొలి సారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. సెప్టెంబరు 27 నుండి అక్టోబర్ 5వ తారీఖు వరకూ శ్రీవారి ఆలయంలో జరుగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను రెండేళ్ళ తరువాత తిరుమాఢ వీధిలో నిర్వహిస్తున్నారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్ళుగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా ఆలయం నిర్వహించారు. కరోనా కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్సవాలను ఆలయం వెలుపల కాకుండా టీటీడీ చరిత్రలోనే మొదటి సారిగా వార్షిక బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించింది.. దీంతో శ్రీవారిని నేరుగా వీక్షించే అవకాశం భక్తులకు దక్కలేదు.
సర్వదర్శనం భక్తులకు మాత్రమే అనుమతి !
కోవిడ్ ప్రభావం పూర్తిగా అదుపులోకి రావడంతో ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఆలయం బయట నిర్వహించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. బ్రహ్మోత్సవాల కారణంగా భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ ఏడాది సెప్టెంబరు 27 వ తారీఖు నుండి అక్టోబర్ 5వ తారీఖు వరకూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో కేవలం సర్వదర్శనం భక్తులను మాత్రమే అనుమతించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో తెలిపారు.
సెప్టెంబర్ 27న పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్ !
సెప్టెంబరు 27వ తేదీన ధ్వజారోహణం సందర్భంగా శ్రీవారిమి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, అక్టోబర్ 1వ తేదీన గరుడ వాహన సేవ, 5వ తేదీన చక్రస్నానం మహోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీన గరుడ సేవ సందర్భంగా ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు అనుమతించరు. బ్రహ్మోత్సవాల సమయంలో వాహన సేవలు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు నిర్వహించనున్నట్లు టిటిడి ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు.
బ్రహ్మోత్సవాలకు భారీగా తరలి వచ్చే భక్తులు !
ఏడాదికి ఒక్క సారి జరిగే బ్రహ్మోత్సవాలకు ఉన్న ప్రాధాన్యతే వేరు.. స్వయంగా ఆ బ్రహ్మదేవుడే దివి నుంచి భువికి దిగ్గి వచ్చి స్వామి వారికి ఉత్సవాలు నిర్వహిస్తారని పురాణాలు చెబుతూ ఉండడంతో ప్రతి ఏటా టిటిడి శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది.. 9 రోజుల పాటు 16వాహనాలపై దర్శనమిచ్చే మలయప్ప స్వామి వైభోగాన్ని కనులారా వీక్షించి తరించేందుకు లక్షలాదిగా భక్తులు తిరుమలకు తరలివచ్చి స్వామి వారి వాహన సేవలను నేరుగా తిలకించి తన్మయత్వం చెందుతారు.. ఇక మూడేళ్ళకు ఒక్క సారి వచ్చే అధికమాసం కారణంగా టీటీడీ శ్రీవారికీ రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తుంది.. మొదట సాలకట్ల బ్రహ్మోత్సవాలను, ఆ తరువాత నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తుంది టిటిడి..