Snake Catcher Bhaskar Naidu: టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఆరోగ్యంపై వైద్యులు ఏమన్నారంటే..
Tirumala Snake Catcher Bhaskar Naidu: తిరుమలలో పది వేలకు పైగా పాములను పట్టుకున్న టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఇటీవల పాము కాటుకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందించారు.
Tirumala Snake Catcher Bhaskar Naidu: పామును చూస్తే చాలు భయంతో పరుగులు తీస్తాం.. కలోలో కనిపించినా ఏదో ఆపద వస్తుందని ఆలయాలలో పరిహారాలు చేస్తుంటాం. కానీ ఆయన మాత్రం పాము కనిపిస్తే చాలు నేను ఉన్న అంటు ముందుకు వస్తాడు. పిల్ల పాముల వద్ద నుండి కాలనాగుల వరకు పట్టుకుంటూ.. మానవ సేవే మాధవ సేవ రూపంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి కొలువులో స్నేక్ క్యాచర్ గా అవతారం ఎత్తి దాదాపు పది వేలకు పైగా పాములను పట్టి అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలి పెట్టాడు. తన ప్రాణాలను పనంగా పెట్టి విష సర్పాల నుండి భక్తులను కాపాడిన వ్యక్తి నేడు విష సర్పం కాటుకు గురై ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తిరుమలలో పది వేలకు పైగా పాములను పట్టుకున్న టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఇటీవల పాము కాటుకు గురయ్యారు. దీంతో భాస్కర్ నాయుడిని హుటాహుటిన స్విమ్స్ ఆసుపత్రి తరలించారు. పరిస్ధితి విషమంగా ఉండడంతో స్నేక్ క్యాచర్‌ను మెరుగైన వైద్యం కోసం అమర్ రాజా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. టీటీడీ అధికారులు దగ్గరుండి ఆయన ఆరోగ్య పరిస్ధితిపై ఆరా తీస్తున్నారు. ఇప్పుడిప్పుడే భాస్కర్ నాయడు ఆరోగ్య పరిస్ధితి కుదుట పడుతుందని వైద్యులు వెల్లడించారు. తిరుమలలో భక్తులను పాముల నుంచి కాపాడుతూ కొన్ని దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న భాస్కర్ నాయుడు త్వరగా కోలుకోవాలని భక్తులు, స్థానికులు శ్రీ వేంకటేశ్వరుడిని ప్రార్ధిస్తున్నారు.
అలా మొదలైంది..
నేను ఉన్నానంటూ తిరుమలలో శ్రీవారి భక్తులను కాపాడేందుకు తన ప్రాణాలను అడ్డు పెట్టి మరి చాకచక్యంగా కాలనాగులను సైతం పట్టి బంధించేవారు భాస్కర్ నాయుడు. వాటిని తిరుమలకు దూరంగా ఉన్న అవ్వాచారి కోనలో వదిలి పెడుతుంటారు. తొలుత 1982లో టీటీడీ అటవీ శాఖలో ఉద్యోగిగా చేరాడు. 10 ఏళ్ల తరువాత ఆయన్ను టీటీడీ శాశ్వత ఉద్యోగిగా తీసుకుంది. అయితే విష సర్పాల వల్ల ఆపద అన్న సమయంలో నేరుగా వచ్చి పాములను చాకచక్యంగా పట్టుకోవడంతో టీటీడీ ఆయన సరైన వ్యక్తి అని భావించింది. అప్పటి నుండి భక్తులను కాపడేందులు భాస్కర్ నాయుడు పూర్తి స్తాయిలో స్నేక్ క్యాచర్ గా మారిపోయారు.
దాదాపు 25 ఏళ్లలో స్నేక్ క్యాచర్‌గా 10 వేలకు పైగా పాములను పట్టుకున్నారు. భక్తులను విష సర్పాల నుండి కాపాడినందుకు టీటీడీ పలుసార్లు భాస్కర్ నాయుడుని సన్మానించి అవార్డులను ప్రధానం చేసింది. దీంతో భాస్కర్ నాయుడికి టీటీడీలో ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అటుతరువాత 2016లో భాస్కర్ నాయుడు ఉద్యోగ విరమణ పొందినా.. ఆయన సేవలు అవసరమని భావించి ఆయన్ను ప్రత్యేకంగా టీటీడీ నియమించుకుంది.
స్నేక్ క్యాచర్‌ను పాము ఎలా కాటు వేసిందంటే...
నాగుపాము, జెర్రిపోతు, కొండచిలువ, గుడ్డి పింజరి, కట్లపాము, దాసరి పాము, బిల్లెరికి వంటి ప్రమాదకరమైన పాములను భాస్కర్ నాయుడు బంధించేవారు. ఈ క్రమంలో ఆయన మూడుసార్లు పాము కాటుకు గురయ్యారు. ఓసారి వేలుకు విషం ఎక్కడంతో ఆ వేలు చివరి భాగం వరకు వైద్యులు తొలగించారు. అయినా భక్తుల సేవ పరమావధిగా భావించి భాస్కర్ నాయుడు పాములకు భయపడకుండా నిరంతరం భక్తులకు సేవలు అందించారు. టీటీడీ అనుబంధ ఆలయాలు, టీటీడీకి సంబంధిన కార్యాలయాల్లో, స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీల్లో పాములు వస్తే ముందుగా భాస్కర్ నాయుడికే ఫోన్ కాల్ వస్తుంది. ఇలానే రెండు రోజుల క్రితం ఎస్వీ యూనివర్సిటీ నుండి ఫోన్ వచ్చింది. వర్సిటీలో ఓ గదిలో పాము వచ్చిందని అక్కడి సిబ్బంది చెప్పడంతో హుటాహుటినా అక్కడికి చేరుకున్న భాస్కర్ నాయుడు పామును పట్టేందుకు ప్రయత్నించే సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఆ సమయంలో చేతిలోని ఫోన్ లో టార్చ్ లైట్ వేసుకుని పామును పట్టేందుకు ప్రయత్నించారు.. ఇంతలో చేతికి వేసుకున్న గ్లౌజ్ జారి పోయింది. అదే సమయంలో పాము అతని చేతిపై కాటు చేసింది.
Also Read: February 2022 Horoscope : ఫిబ్రవరి నెలలో ఈ నాలుగు రాశులవారి జాతకమే మారిపోతుంది..మీరున్నారా ఇందులో...
Also Read: Weather Updates: ఏపీ, తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అకాల వర్షాలతో పెరిగిన చలి తీవ్రత..