Tirumala Rain: తిరుమలలో సడెన్‌గా ఉరుములు, మెరుపుల భారీ వర్షం - లోతట్టు ప్రాంతాలు జలమయం!
ఆలయం వెలుపల రాంభగిచా అతిథి గృహాల వద్ద మోకాళ్లు లోతుకి నీరు చేరింది. పార్కింగ్ ప్రదేశంలో ఉంచి ద్విచక్ర వాహనాలు సైతం మునిగి పోయాయి.
తిరుమలలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు, ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి చేయగా సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు, దర్శనానంతరం ఆలయం వెలుపలికి చేరుకున్న భక్తులు వర్షం దాటికి షెడ్ల కిందికి పరుగులు తీశారు. చిన్నపిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
షాపింగ్ కాంప్లెక్స్, లోతట్టు ప్రాంతాల దుకాణాల్లోకి వర్షపు నీరు చేరడంతో వస్తువులు తడిసిపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఆలయం వెలుపల రాంభగిచా అతిథి గృహాల వద్ద మోకాళ్లు లోతుకి నీరు చేరింది. పార్కింగ్ ప్రదేశంలో ఉంచి ద్విచక్ర వాహనాలు సైతం మునిగి పోయాయి. ఇక శ్రీవారి నాలుగు మాఢ వీధులు, శ్రీవారి ఆలయం ముందు భాగం, లడ్డూ కౌంటర్, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగి పోయాయి. రాత్రి అంతా వర్షం కురుస్తూనే ఉండడంతో శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులు ఇబ్బందులకు గురి అయ్యారు.
మరోవైపు, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం భక్తులతో 9 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు 14 గంటలు టైం పడుతుంది. స్వామివారిని శుక్రవారం 69,529 మంది భక్తులు దర్శించుకోగా 29,227 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.85 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
నేటి నుంచి పవిత్రోత్సవాలు
ఇవాల్టి (ఆగస్టు 27) తిరుమలలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇవి ఈ నెల 29వ తేదీ వరకు ఉంటాయి. ఈ వేడుకలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ శనివారం సాయంత్రం సహస్ర దీపాలంకార సేవను రద్దు చేసింది. పవిత్రోత్సవాల అంకురార్పణలో భాగంగా ముందుగా సేనాధిపతివారిని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని పవిత్ర మండపంలో అంకురార్పణ వైదిక కార్యక్రమాలు చేపట్టారు. తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో ఆయా వైదిక కార్యక్రమాలను నిర్వహించారు.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల గానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. 1962వ సంవత్సరంలో అప్పటి టీటీడీ పాలకమండలి ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.