Tirumala News: శ్రీమలయప్పస్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం - తులసి, తామర గింజలతో
శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో బుధవారం (సెప్టెంబర్ 20) మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు అర్చకస్వాములు వేద మంత్రోచ్ఛారణ మధ్య స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
తామర గింజలు, తులసి గింజలు, పవిత్రమాలలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో బుధవారం (సెప్టెంబర్ 20) మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు అర్చకస్వాములు వేద మంత్రోచ్ఛారణ మధ్య స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనులను చేసి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. రంగురంగుల ఆర్కిడ్ పుష్పాలు, తామరలతో వేదికను సుందరంగా తీర్చిదిద్దారు.
ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం చేపట్టారు.
ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేదపారాయణదారులు పారాయణం చేశారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్లు పఠించారు. ఈ వేడుకలో పవిత్రమాలలతో దండలు, ఆకుపచ్చ పవిత్రమాలలతో దండలు, పసుపురంగు పట్టుదారం దండలు, తామర గింజలు, తులసి గింజలతో దండలు, గోల్డ్ గ్రేప్స్ మాలలు, బాదం మాలలు, నందివర్ధనం, రోజ్ పెటల్స్, మల్టీకలర్ రోజ్ పెటల్స్ మాలలు, కిరీటాలు, తులసి దండలు స్వామి అమ్మవార్లకు అలంకరించారు.
టీటీడీ గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణలు చేశారు. తమిళనాడులోని తిరుపూర్ కు చెందిన శ్రీ రాజేందర్ ఈ మాలలను విరాళంగా అందించారు. టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి, ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి, జేఈవో శ్రీమతి సదా భార్గవి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సింహ వాహనం - ధైర్యసిద్ధి
శ్రీవారు మూడో రోజు (సెప్టెంబరు 20) ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో 'సింహదర్శనం' అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉభయ దేవరులతో కలిసి స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. శ్రీవారికి బ్రహ్మోత్సవాల పురస్కరించుకొని మూడు రోజులపాటు స్నాపన తిరుమల కార్యక్రమాన్ని టిటిడి వైభవంగా నిర్వహిస్తుంది. స్నపల తిరుమల నేపథ్యంలో శ్రీవారికి వివిధ రకాల పుష్పాలతో తయారుచేసిన పూలమాలలు కిరీటాలను గార్డెన్ విభాగం ప్రత్యేకంగా తయారు చేసింది. ముఖ్యంగా పవిత్రాలతో పూలమాలలు., కిరీటాలు తయారు చేశారు. తామర పుష్పపు విత్తనాలు, తులసి గింజలతో పూల మాలలు కిరీటాలను తయారు చేశారు. ఎండు ద్రాక్షలతో కూడా మాలను కిరీటాలను తయారు చేశారు. నందివర్ధనం, బాదంపప్పు, రోజా రేకులతో మాలలు కిరీటాలను తయారు చేశామని గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు వెల్లడించారు.