TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం
ఏపీ మంత్రుల వ్యవహార శైలిపై సామాన్య భక్తులు మండి పడుతున్నారు. శ్రీవారి దర్శనాల అమలు విధానంలో టీటీడీ అవలంబిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది.
టీటీడీ నింబంధనలను తుంగలో తొక్కి అధికార పార్టీ మంత్రులతో పాటుగా మంత్రుల అనుచరులు ప్రోటోకాల్ దర్శనాలతో శ్రీనివాసుడి దర్శనం పొందుతున్నారు. టీటీడీ అధికారులపై ఒత్తిడులు తెచ్చి ఏపి మంత్రులు హవా కొనసాగిస్తుండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కేవలం పది మందికి మాత్రమే ప్రోటోకాల్ దర్శనాలు జారీ నిబంధనలు ఉన్నప్పటికి పదుల సంఖ్యలో అనుచరులని వెంట పెట్టుకుని మంత్రులు రావడంతో టీటీడీ అధికారులకి తలనొప్పిగా మారింది. తిరుమల శ్రీవారి దర్శనం సామాన్య భక్తులకు అందనంత దూరంలోకి వెళ్తుంది.
నిత్యం వేలాది మంది భక్తులు దేశ విదేశాల నుండి శ్రీనివాసుడి దర్శనార్థం తిరుమలకు చేరుకుంటారు. ఇలా చేరుకున్న భక్తులు వారి వారి స్ధోమతకు తగ్గట్టుగా వివిధ రూపాల్లో స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక సామాన్య భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా వెళ్ళి సర్వదర్శనం ద్వారా స్వామి వారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. రోజులు, గంటల తరబడి క్యూలైన్స్ లో వేచి ఉండి మరి స్వామి వారిని చూడందే వెను తిరగరు భక్తులు. ఎన్ని గంటలైనా, ఎన్ని రోజులైనా స్వామి వారి దర్శనంతోనే తిరిగి గమ్య స్ధానం చేరుకుంటారు సామాన్య భక్తులు.
అయితే ప్రస్తుతం ఏపీ మంత్రుల వ్యవహార శైలిపై సామాన్య భక్తులు మండి పడుతున్నారు. శ్రీవారి దర్శనాల అమలు విధానంలో టీటీడీ అవలంబిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. భక్తుల రద్దీ పేరుతో సామాన్య భక్తులను గంటల తరబడి వేచి ఉంచే టీటీడీ. ప్రముఖులకు మాత్రం సాగిలపడి సేవలు అందిస్తోందనే విమర్శలు వస్తున్నాయి ఇక ఏపీ మంత్రులు వారి బంధువర్గం, అనుచరులకు ఇష్టానుసారం టిక్కెట్లను జారీ చేయడమే కాకుండా ప్రోటోకాల్ మర్యాదలతో శ్రీనివాసుడి దర్శన భాగ్యం కల్పిస్తోందనే ఆరోపనలు వస్తున్నాయి.
సామాన్య భక్తులకే మా మొదటి ప్రాధాన్యత, వారికి త్వరగతిన శ్రీవారి దర్శనం చేయించడమే మా లక్ష్యం అనే పాలక మండలి, టీటీడీ అధికారులు. ఆ మాటలను మరిచి పోయి అధికార పార్టి నాయకులకు సాగిల పడి సేవలందిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా టీటీడి నిబంధనల మేరకు ఓ సిఫారస్సు లేఖపై ఆరుకు మించి టిక్కెట్లు జారీ చేయరాదు. అలాంటిది ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అధికారులు ఈ నిబంధనలను మరిచి ప్రవర్తిస్తున్నారని అంటున్నారు.
మంత్రితోపాటు 140 మంది
ఇబ్బడి ముబ్బడిగా దర్శన టిక్కెట్లను జారీ చేయడమే కాకుండా వీరితో పాటు వచ్చే అనుచరులకు కూడా ప్రోటోకాల్ మర్యాదలతో స్వామి వారి దర్శనం కల్పిస్తొంది టీటీడీ. గత నెల జూలై 28వ తారీఖున వీఐపీ బ్రేక్ దర్శనంలో ఏపీ మంత్రి అప్పలరాజుతో పాటుగా తన అనుచరులైన దాదాపు 140 మందికి బ్రేక్ దర్శనం పొందారు. దర్శనంతరం బయటకు వచ్చిన మంత్రే స్వయంగా 140 మంది తన నియోజకవర్గం ప్రజలు కలిసి స్వామి వారి దర్శనం చేసుకున్నామని చెప్పడం విషయం తీవ్ర దుమారం రేపింది.
అయితే ఇవాళ వేకువజామున నిర్వహించే సుప్రభాతం సేవకు దాదాపు చాలా మంది అనుచరులతో కలిసి ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి ఉషాశ్రీ చరణ్ వెళ్ళారు. అంతటితో ఆగకుండా వీఐపీ బ్రేక్ సమయంలో ఏకంగా 50 టిక్కెట్లను జారీ చేయించుకొని దర్శనం పొందారు. తమ వారందరికి ఖచ్చితంగా ప్రోటోకాల్ దర్శనాలు కావాలని ఉషాశ్రీ చరణ్ ఒత్తిడి తీసుకుని రాగా, అందుకు నిరాకరించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి, కేవలం 15 మందికి ప్రోటోకాల్ దర్శనాలు కల్పించి, మిగిలిన 35 మందికి అరైవల్ పెట్టి బ్రేక్ దర్శనాలు కల్పించారు. దీంతో ప్రముఖులకు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా టిక్కెట్లను జారీ చేయడంపై భక్తులు మండి పడుతున్నారు. తమకో న్యాయం ప్రముఖులకు మరో న్యాయమా అంటూ భక్తులు టీటీడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.