వరుస చిరుత దాడులతో టీటీడీ అలర్ట్, అలిపిరి మార్గంలో ప్రతి 10 మీటర్లకు సెక్యూరిటీ గార్డు: ఈవో
తిరుమల అలిపిరి మార్గంలో శుక్రవారం రాత్రి ఆరేళ్ల చిన్నారి మృతి చెందడం పై టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ..లక్షిత తప్పిపోయిందని పాపతల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తిరుమల అలిపిరి మార్గంలో శుక్రవారం రాత్రి ఆరేళ్ల చిన్నారి మృతి చెందడంపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ... లక్షిత తప్పిపోయిందని శుక్రవారం రాత్రి పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందినప్పటి నుంచి కూడా సుమారు 70 మంది సిబ్బంది పాప కోసం గాలించారు.
అయితే నిన్న స్వామి వారిని దర్శించుకోవడం కోసం భారీ సంఖ్యలో భక్తులు కాలి మార్గాన వచ్చారు. పాప ఒంటరిగా వెళ్తుండటంతో ఎవరైనా ఎత్తుకుపోయారేమో అనే కోణంలో కూడా విచారణ చేపట్టామని ఆయన వివరించారు. కానీ శనివారం తెల్లవారు జామున పాప మృతదేహాం లభ్యం కావడం చాలా విషాదకరమైన విషయమంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నెల రోజుల క్రితం బాలుడు కౌశిక్ ని పులి పిల్ల లాక్కెల్లిన ఘటన తరువాత నడక మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా అనుమతిస్తున్నామని, ఈ క్రమంలో కాలిబాట మార్గంలో సుమారు 500 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పది మీటర్లకు ఓ సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆ మార్గంలో కంచె ఏర్పాటు గురించి అటవీ అధికారులను నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. అయితే ఈ పాప ఘటనలో డీఎఫ్ వో నేతృత్వంలో ఓ కమిటీని నియమించి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.
అయితే ఇప్పటికీ పాప మీద ఏ జంతువు దాడి చేసింది అనే విషయం ఇంకా నిర్థారణ కాలేదని వివరించారు. గతంలో ఒక చిరుతను బంధించిన సమయంలోనే మరో చిరుతను కూడా పట్టుకునేందుకు ప్రయత్నించామని తెలిపారు. చిరుత దొరకలేదని.. కానీ ఆ ప్రాంతంలోనే ఎలుగు కూడా సంచరిస్తుందని తెలిపారు.
గాలి గోపురం నుంచి నరసింహ స్వామి గుడి వరకు అదనపు భద్రతను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను 6 గంటల లోపల మూసివేయ్యాలని అటవీ అధికారులకు సూచించామని తెలిపారు. టీటీడీ చైర్మన్‌ను సంప్రదించి కాలిబాట మార్గంలో ఆంక్షలపై నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.