TTD Subbareddy : అది చర్చే, టిక్కెట్ రేట్లు పెంచలేదు - వైరల్ వీడియోపై టీటీడీ చైర్మన్ క్లారిటీ !
శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ ధరలను పెంచలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఓ వీడియోను చూపి సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంపుపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. సేవా టికెట్ల జారీలో విఐపిల ఒత్తిడి తగ్గించి సామాన్య భక్తులకు సేవా టికెట్లు మరిన్ని అందుబాటులోకి తేవాలనే సదుద్దేశంతో చర్చ జరిగిందని స్పష్టం చేశారు. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారంలోనే చర్చ జరిగిందని సామాన్య భక్తులకు కేటాయించే సేవా టికెట్ల ధరలు పెంచడం లేదనే విషయాన్ని ఎవరూ చెప్పడం లేదన్నారు.సామాన్య భక్తులకు కేటాయించే టికెట్ల ధరలు పెంచుతున్నామని, పెంచేశామని తప్పుడు ప్రచారాలు చేసి భక్తుల్లో ఆందోళన రేపుతున్నారని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. తమ పాలక మండలి సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకోదని ఆయన స్పష్టం చేశారు.
ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంపుపై చాలాకాలంగా చర్చ జరుగుతోందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సేవాటికెట్లు పరిమితంగా ఉండగా, సిఫారసు లేఖలు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయని ... సిఫారసులను తగ్గించేందుకు విచక్షణ కోటాలో ఉన్న సేవా టికెట్ల ధరలను పెంచితే ఎలా ఉంటుందనే విషయంపై చర్చ మాత్రమే జరిగిందన్నారు. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సుబ్బారెడ్డి తెలిపారు. సామాన్యులకు కేటాయించే ఆర్జిత సేవాటికెట్ల ధరల పెంచాలనే ఆలోచనే తమకులేదన్నారు. వి ఐ పిల ప్రయోజనాలను కాపాడి సామాన్య భక్తుల ప్రయోజనాలను దెబ్బతీయాలనుకుంటున్న వారే ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
టీటీడీ పాలకమండలి సమావేశంలో టిక్కెట్ ధరలపై జరిగిన చర్చ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పలువురు రాజకీయ నేతలు కూడా మండిపడ్డారు. దేవుడితో వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు.
టిటిడి ధార్మికమండలిని @ysjagan దోపిడీ మండలిగా చేశారు. శ్రీవారి సేవా టికెట్లను దోపిడీ దొంగల్లా టిటిడి పాలక మండలి సభ్యులు వాటాలేసుకుంటున్నారు. ప్రసాదం, వసతి, సేవా టికెట్ల రేట్లు భారీగా పెంచి ఏడుకొండలవాడిని భక్తులకు దూరం చేసే కుట్ర చేస్తున్నారు.(1/3) pic.twitter.com/qIgLqRiXaz
— Lokesh Nara (@naralokesh) February 23, 2022
తాను, సభ్యులు పాలక మండలి సమావేశంలో మాట్లాడిన మాటలను సాంకేతిక పరిజ్ఞానంతో వారికి కావాల్సిన విధంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.టీటీడీ తరపున గత రెండున్నరేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. అవన్నీ విమర్శించేవారికి తెలియడం లేదా అని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఆరోపణలు చేసే వారి విమర్శలకు భయపడి ఈ కార్యక్రమాల అమలుపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సుబ్బారెడ్డి చెప్పారు. భక్తులకు మేలు చేసే సద్విమర్శలని తాము ఎప్పుడూ స్వాగతిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేకి అని ప్రజల్లో అభిప్రాయం కల్పించేందుకు జరుగుతున్న రాజకీయ కుట్రను భక్తులు గ్రహించాలని ఆయన కోరారు.