Jagan Threatened with Gun: జగన్ గన్ పెట్టి బెదిరించారు - టీటీడీ చైర్మన్ సంచలన ఆరోపణలు
TTD Chairman: అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ నిర్మాణం విషయంలో నాటి సీఎం జగన్ పై సంచలన విషయం బయట పెట్టారు. దేవలోక్ అనే ప్రాజెక్టును క్యాన్సిల్ చేయడానికి గన్ పెట్టి బెదిరించారన్నారు.

TTD Chairman alleges Jagan threatened with gun: తిరుమల శ్రీవారి పాదాల చెంత అలిపిరిలో గతంలో దేవలోక్ అనే ప్రాజెక్టు కోసం స్థలాన్ని లీజుకు తీసుకున్న అజయ్ కుమార్ ను జగన్ తాడేపల్లికి పిలిపించి గన్ పెట్టి బెదిరించారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. శేషాచలం కొండల కింద ఉన్న స్థలాన్ని దేవలోక్ ప్రాజెక్టు కోసం ఇస్తే దాన్ని బెదిరించి వెనక్కి తీసుకుని కోట్ల లంచాలు తీసుకుని ఒబెరాయ్ హోటల్‌కు కేటాయించారన్నారు. ముంతాజ్ హోటల్ పేరుతో అక్కడ నిర్మాణాలు చేపట్టారని ఇప్పుడు తాము ఆ ఒప్పందాన్ని రద్దు చేసి.. దేవలోక్ కు కేటాయించిన 10ఎకరాల స్థలాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించారు.
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ఉండడానికి అర్హుడు కాదని.. ఆయనను నగరం నుంచి తరిమికొట్టాలన్నారు. టిటిడిపైన ప్రతిరోజు బురదజల్లడానికి ప్రయత్నిస్తున్నారని..ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. టిటిడిపై జరుగుతున్న విషప్రచారాన్ని ఖండిస్తున్నామని.. ఆధ్యాత్మిక నమూనాల నిర్మాణం కోసం దేవలోక్ కు స్థలాన్ని కేటాయించారన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ఒబెరాయ్ హోటల్ కు స్థలాన్ని కేటాయించింది వైసీపీ నేతలేనన్నారు.
తాము అధికారంలోకి వచ్చాక 2024 నవంబర్ 18న టిటిడి బోర్డు సమావేశంలో ఒబెరాయ్ కు కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపామని గుర్తు చేశారు. భూమికి బదులు భూమిని ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ఒబెరాయ్ హోటల్ కు ప్రస్తుతం దక్షిణంవైపున స్థలాన్ని కేటాయించామన్నారు. ఉత్తరం దిక్కున ఇవ్వమని సిఎం చెప్పారన్నారు. భూమన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. సిబిఐ ఎంక్వైరీ అని చెప్పడానికి భూమనకు సిగ్గులేదా అని ప్రశఅనించారు. కోట్లకు కోట్లు టీటీడీ డబ్బులను భూమన కొట్టేశారని ఆరోపించారు. టీటీడీకి చెందిన ఇంచ్ భూమి కూడా ప్రైవేటు వ్యక్తులకు కేటాయించబోమని టీటీడీ చైర్మన్ తెలిపారు. తిరుమల పవిత్రతకు ఎక్కడా భంగం వాటిల్లకుండా చూస్తామన్నారు.
2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో.. అలిపిరి వద్ద అధ్యాత్మకి పుణ్యక్షేత్రాల నమూనాలను నిర్మించేందుకు దేవలోక్ అనే ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు కోసం అజయ్ కుమార్ అనే వ్యక్తికి టీటీడీ పది ఎకరాల స్థలాన్ని లీజుకు వచ్చింది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దేవలోక్ ప్రాజెక్ట్ ముందుకెళ్లలేదు. టీటీడీ ఆ భూముల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. స్టార్ హోటల్ నిర్మించేందుకు ఆ పది ఎకరాల భూముల్ని ఒబెరాయ్ గ్రూపునకు కేటాయించింది. ముంతాజ్ హోటల్ పేరుతో ఒబెరాయ్ గ్రూప్ నిర్మాణాలు ప్రారంభించింది. అయితే అలిపిరిలో ముంతాజ్ అనే పేరుతో హోటల్ కట్టడం వివాదాస్పదమయింది. టీడీపీ ప్రభుత్వం భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఒబెరాయ్ గ్రూపును అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు ఒప్పించింది. టీటీడీకి మళ్లీ ఆ స్థలాన్ని అప్పగించింది. అయితే అసలు హోటల్ కు లీజుకిచ్చిన వైసీపీ నేతలు ఇప్పుడు ఆ టీటీడీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. దీంతో టీటీడీ చైర్మన్ ఈ వివరాలన్నీ వెల్లడించారు.





















