Tirumala Incidents: ప్లాన్ ప్రకారమే తిరుమలలో వరుస ఘటనలు, విచారణ చేపట్టాలని డీజీపీకి భానుప్రకాష్ రెడ్డి లేఖ
Bhanu Prakash Reddy | తిరుమలలో ఇటీవల జరుగుతున్న వరుస ఘటనల వెనుక కుట్రకోణంపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి లేఖ రాశారు.

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala)లో ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు అనుకోకుండా జరిగినవి కావని టీటీడీ బోర్డు సభ్యుడు, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి (Bhanu Prakash Reddy) అన్నారు. ముందస్తు ప్రణాళికతోనే తిరుమలలో నేరపూరిత కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఇటీవల తిరుమలలో జరుగుతున్న వరుస ఘటనలపై దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు భాను ప్రకాష్ రెడ్డి ఆదివారం నాడు లేఖ రాశారు.
ఉద్దేశపూర్వకంగానే తిరుమలపై దుష్ప్రచారం..
‘ఏపీలో అధికారం కోల్పోవడంతో వైకాపా ఉద్దేశపూర్వకంగానే టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి, ప్రభుత్వంపై బురద జల్లడానికి తప్పుడు వార్తలు రాయిస్తోంది. అందులో భాగంగానే తిరుమల లో గోశాలలో వందల సంఖ్యలో ఆవులు చనిపోయాయని వైసీపీ మాజీ ఎమ్మెల్యే, టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. గోశాలకు సంబంధించి కొన్ని వీడియోలను సైతం ఆయన విడుదల చేశారు. తిరుమలలో అన్ని మతానికి చెందిన వ్యక్తి ప్రార్థన చేస్తుండగా వీడియో రికార్డు చేశారు. ఆ వీడియోను ఉద్దేశపూర్వకంగానే సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ వివాదం సమస్య పోయిందనుకునే లోపు క్యూలైన్లలో ఓ భక్తుడు టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు, టిటిడి ఈవో శ్యామల రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా వీడియో రికార్డు చేశారు. ఆ సమయంలో అక్కడికి ఫోన్ ఎలా వచ్చింది. వీడియో రికార్డు చేయడం ఎలా సాధ్యమైంది.
వైసీపీ కుట్ర కోణంపై సైతం దర్యాప్తు జరపాలని డీజీపీకి లేఖ
కొన్ని రోజుల కిందట తిరుమలలో లడ్డూ నాణ్యత లేదని ప్రచారం, కొండపై మద్యం అని నిత్యం ఏదో విషయంపై తిరుమలలో అవాంఛిత ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలు అనుకోకుండా జరిగినవి కావనీ, ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్ర అని.. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడం, కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నమేనని భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. తిరుమలలో జరుగుతున్న వరుస ఘటనల వెనుక వైసిపి నేతల కుట్ర కోణంపై సైతం దర్యాప్తు చేయాలని’ ఏపీ డీజీపీకి రాసిన లేఖలో ఆయన కోరారు






















