Tirupati News: తిరుపతిలో ‘మీకు మీరే మాకు మేమేు’ - టీడీపీ, జనసేన మధ్య మొక్కుబడి బంధం!
Tirupati Politics: పాత మిస్సమ్మ సినిమాలో సరదాగా ‘మీకు మీరే మాకు మేమే..’ అంటూ సాగే ఓ పాటను ఇప్పుడు తిరుపతి వాసులు రాజకీయానికి అనువదించి చర్చించుకుంటున్నారు.
Tirupati TDP and Janasena: తిరుపతి నగరం వైపు రాష్ట్ర రాజకీయాలు చూస్తున్నాయి. నిన్నటి వరకు బోగస్ ఓట్లు అంటూ కలెక్టర్ స్దాయి అధికారి సస్పెండ్ కావడం... అందుకు అనుబంధం గా అధికారులు, పోలీసులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడంతో అనుకోని విధంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆధ్యాత్మిక రాజధాని ప్రతిరోజూ వార్తల్లో నిలిచింది.
త్వరలో ఎన్నికలు నోటిఫికేషన్...
త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించిన తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు ప్రస్తుత నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి అన్ని వర్గాల వారితో ఆత్మీయ సభలు, పలకరింపులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు దేశం పార్టీ- జనసేన పార్టీ నాయకులు కలిసి ముందుకు వెళ్ళే పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సైతం ఉమ్మడిగా కార్యక్రమాలకు హాజరై కొంత సమయం ఉండి వెళ్లి పోతున్నారు తప్ప ఎక్కడ క్షేత్రస్థాయిలో రెండు పార్టీల కలిసి పోతున్న పరిస్థితి కనిపించడం లేదనే బలమైన చర్చ ఇరుపార్టీల నాయకుల మధ్య కొనసాగుతుందని అంటున్నారు.
గెలుపు అవకాశాలు ఎక్కువ
తిరుపతిలో తెలుగుదేశం- జనసేనకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత ఎన్నికల్లో సైతం స్వల్ప మెజారిటీతో వైకాపా అభ్యర్థి గెలుపొందారు. ఈ క్రమంలో టీడీపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరు అని పక్కన పెట్టి గెలుపు కోసం కృషి చేస్తే తప్పక విజయం సాధిస్తామని ఆయా పార్టీలు నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు తాము చేసిన నగరాభివృద్ధి... తమ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఆదరిస్తాయని వైకాపా నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికార పీఠం పై ప్రజలు ఎవరిని కూర్చోబెట్టాలో ప్రజలు నిర్ణయం తీసుకుంటారు.