Tirumala Alert: ఈ నెలలో ఆ 3 రోజులు సర్వదర్శనం టోకెన్లు రద్దు: టీటీడీ ప్రకటన
Tirumala Sarva Darshan tokens: ఫిబ్రవరి 15, 16, 17 తేదీల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు రద్దు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.
తిరుపతి: రథసప్తమి సందర్భంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15, 16, 17 తేదీల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు రద్దు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. రథసప్తమి సందర్భంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అన్నమయ్య భవన్‌లో టీటీడీ అధికారులు, పోలీసు అధికారులతో ఈవో ధర్మారెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
ఏడు వాహనాలపై స్వామివారి ఉరేగింపు
ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. రథసప్తమికి సంబంధించిన ఏర్పాట్లపై అన్నప్రసాదం, ఆరోగ్యశాఖ, ఇంజనీరింగ్ విభాగం, ఆలయం, ఉద్యానవనశాఖ, శ్రీవారి సేవ, భద్రతా విభాగం, ఎస్వీబీసి, ధర్మప్రచారపరిషత్ తదితర విభాగాధిపతులకు పలు సూచనలు చేశారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు తిరుమలలో ఏడు వాహనాలపై స్వామివారి ఉరేగింపును తిలకించడానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
భక్తుల సౌకర్యార్థం 3.5 లక్షల లడ్డూలు
రథసప్తమి సందర్భంగా తిరుమలకు విచ్చేసే భక్తులు చలికి, ఎండకు ఇబ్బంది పడకుండా మాడ వీధుల్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయలన్నారు. భక్తుల సౌకర్యార్థం 3.5 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుకోవాలని పోటు అధికారులను ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తిలకించేందుకు వీలుగా ఎస్వీబీసీలో వాహనసేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. వాహనసేవల ఎదుట ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీ నిఘా, భద్రతా విభాగం అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకుని మెరుగైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఈవో ధర్మారెడ్డి ఆదేశించారు.
అన్నప్రసాదం అధికారులు ఉదయం నుంచి రాత్రి వరకు గ్యాలరీలలో వాహనాలను తిలకించడానికి వేచి ఉండే భక్తులకు.. తాగునీరు, మజ్జిగ, సాంబారు అన్నం, పెరుగు అన్నం, పులిహోర, పొంగలి వంటి అన్న ప్రసాదాలను నిరంతరాయంగా పంపిణీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. భక్తుల దాహార్తిని తీర్చడానికి శ్రీవారి సేవకుల సహకారంతో ఎప్పటికప్పుడు తాగునీరు అందించాలని ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసర సేవలందించడానికి వీలుగా వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్సు వాహనాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని వైద్యాధికారులకు ఆయన సూచించారు. మాడవీధులలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. రథసప్తమి సందర్భంగా వివిధ రకాల ఫలపుష్పాలతో, పచ్చని తోరణాలతో, అందమైన అరటి చెట్లతో పందిళ్ళను ఏర్పాటు చేసి తిరుమాడ వీధులను అందంగా అలంకరించాలని ఉద్యానవన విభాగం అధికారులను ఈవో ఆదేశించారు.
రథసప్తమిని పురస్కరించుకొని ఆర్జిత సేవలను రద్దు చేసినట్టు తెలిపారు. ఆ రోజున ఎటువంటి ప్రత్యేక దర్శనాలు (విఐపి బ్రేక్, వయోవృద్ధులు, వికలాంగులు మరియు చంటిపిల్లల తల్లిదండ్రులకు) ఉండవని చెప్పారు. అదే విధంగా ఫిబ్రవరి 14వ తేదీ తెల్లవారు జామున 12 గంటల నుండి 16వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు టిబి, ఎంబిసి - 34 కౌంటర్లను మూసివేసి, సిఆర్‌వో, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనాల సమూదాయంలో మాత్రమే గదులు కేటాయించాలన్నారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని టీటీడీ భద్రతా విభాగం మరియు పోలీసు అధికారులు సమన్వయంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఈవో ఆదేశించారు.
వాహన సేవల వివరాలు:
- తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోదయం ఉదయం 6.40 గంటలకు) - సూర్యప్రభ వాహనం
- ఉదయం 9 నుంచి 10 గంటల వరకు - చిన్నశేష వాహనం
- ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు - గరుడ వాహనం
- మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు - హనుమంత వాహనం
- మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు - చక్రస్నానం
- సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు - కల్పవృక్ష వాహనం
- సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు - సర్వభూపాల వాహనం
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు - చంద్రప్రభ వాహనం