Tirumala News: తిరుమలలో పలు దర్శనాలు రద్దు, కారణాలు ఏంటంటే
Tirumala news: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో పలు దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. డోనర్స్ రూమ్స్ కూడా రద్దు చేసింది.
Tirumala News: తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులు ఈ విషయాలు గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను అక్టోబరు 3 నుండి 12వ తేదీ వరకు టిటిడి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధికంగా విచ్చేస్తారు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేసి వారికి సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాలలో బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా అక్టోబరు 3 (అంకురార్పణం) నుండి 12వ తేదీ (చక్రస్నానం) వరకు ప్రతి రోజు వయో వృద్దులు, దివ్యాంగులు, సం|| లోపు చిన్న పిల్లల తల్లిదండ్రులకు టిటిడి రద్దు చేసింది. విఐపి బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టిటిడి పరిమితం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది.
దాతలకు గదుల కేటాయింపు రద్దు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు భక్తుల సౌకర్యార్థం టిటిడిలోని వివిధ ట్రస్టులకు, పథకాలకు విరాళాలు అందించిన దాతలకు కేటాయించే గదులను టిటిడి రద్దు చేసింది. అదేవిధంగా అక్టోబరు 4న ధ్వజారోహణం, అక్టోబర్ 12న చక్రస్నానం జరిగే రోజుల్లో మినహా మిగతా రోజులలో దాతలను దర్శనానికి అనుమతిస్తారు. దాతలు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరుతోంది.
ఆగష్టు 30న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆగష్టు 30వ తేదీన శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గణపతి పూజ, లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్ల తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
సెప్టెంబర్ 6 నుండి 8వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బాలాలయం
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సెప్టెంబర్ 6 నుండి 8వ తేదీ వరకు బాలాలయం జరుగనుంది. ఇందుకోసం సెప్టెంబర్ 6న సాయంత్రం 5.30 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు. సాధారణంగా గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం ''బాలాలయం'' చేపడతారు. ఇందుకోసం ఆలయంలోని మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్రపట్టాలను ఏర్పాటు చేస్తారు. తదుపరి మహా సంప్రోక్షణ జరుగువరకు స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు. ఆలయంలోని యాగశాలలో సెప్టెంబర్ 7, 8వ తేదీలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 9.30 నుంచి 10. 30 గంటల మధ్య తులా లగ్నంలో బాలాలయ సంప్రోక్షణ నిర్వహిస్తారు.