AP Elections 2024: తిరుపతి, చంద్రగిరి, పుంగనూరు నియోజకవర్గాల్లో ఉద్రిక్తత - తిరుపతి జిల్లాకు మరిన్ని కేంద్ర బలగాలు
Andhra Pradesh News: ఏపీలో ఎన్నికల వేడి మరింత రాజుకుంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో ఈ ప్రాంతాలకు మరిన్ని కేంద్ర బలగాలు రానున్నాయి.
Andhra Pradesh Elections 2024: ఎన్నికలు సజావుగా నిర్వహించాలి.. అందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. ఎలాంటి తప్పులు, గొడవలు జరిగినా తమకు సమాచారం ఇవ్వాలి అంటూ ఎన్నికల అధికారులు ఆయా రాజకీయ పార్టీల నాయకులకు పలు దఫాలు సమావేశం నిర్వహించి సూచించారు. కానీ అనుకోని సంఘటనతో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల రణరంగంగా మారిన ఘటనలు నెలకొన్నాయి.
తిరుపతి
ప్రశాంత తిరుపతి నగరంలో ఎన్నికల ప్రచారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇటీవల దొడ్డపురం వీధిలో ప్రచారం చేస్తున్న కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కు అడ్డంగా వైసీపీ నాయకులు ప్రచారం చేశారు. దీనిని ప్రశ్నించడంతో ఇరు పార్టీల నాయకులకు తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు ఇరు పార్టీల వారిని పంపి వేసారు. అదేవిధంగా శనివారం సాయంత్రం గిరిపురంలో కూటమి అభ్యర్థి ప్రచారం చేపట్టిన వీధిలోనే వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకుని ప్రచారం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటమాట పెరిగి కొట్టుకున్నారు. దీంతో పోలీసులు ఇరుపార్టీల వారిని అక్కడి నుంచి పంపి వేసారు. ఒక అభ్యర్ది ప్రచారం చేస్తున్న ప్రాంతంలో మరో పార్టీ వాళ్లు ప్రచారం చేయడం ఏంటని, గొడవ జరిగిన పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడంపై వారిపై పలు ఆరోపణలు వస్తున్నాయి.
చంద్రగిరిలో గొడవ
చంద్రగిరి నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేయడానికి ఆఖరి రోజు టీడీపీ తరపున పులివర్తి నాని, వైసీపీ తరపున చెవిరెడ్డి మోహిత్ రెడ్డి భారీ ర్యాలీలు నిర్వహించి ఊరేగింపుగా తిరుపతి ఆర్డీవో కార్యాలయం అయిన ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. ఒకే సమయానికి రెండు పార్టీల వారు ఎంతో ప్రాంతానికి వస్తారని ముందస్తుగా ఆర్వో తో పాటు పోలీసులకు పూర్తి సమాచారం ఉంది. అయిన పోలీసులు సాధారణ బందోబస్తు ఏర్పాటు చేశారు. 100 మీటర్ల లోపలకు పోలీసులు నామినేషన్ వేసే వ్యక్తులు వారిని ప్రపోజ్ చేసే వారిని మాత్రమే కేంద్రం లోపలికి అనుమతిస్తారు. ఒక వైపు నుంచి ముందుగా వచ్చిన వైసీపీ వారిని అడ్డుకున్న పోలీసులు. మరో వైపు నుంచి వచ్చిన టీడీపీ వారిని నియంత్రించలేకపోయారు. దీంతో వైసీపీ వారు సైతం కేంద్రం ముందుకు వచ్చారు. దీంతో గొడవ జరిగింది. మరింత బందోబస్తు ఏర్పాటు చేసి రెండు పార్టీల వారిని నియంత్రించి ఉంటే గొడవ జరిగేది కాదు.
పుంగనూరు ఘటన
పుంగనూరు నియోజకవర్గం మాగాండ్లపల్లి లో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఆ గ్రామంలోని ఓ వైసీపీ నాయకుడు ఇంటి వద్ద కరపత్రాల పంపిణీ సమయంలో మాట మాట పెరిగి గొడవకు దారితీసింది. ఇరు వర్గాల వారు కర్రలతో దాడి చేసుకుంటూ, పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడికి బీసీవై పార్టీ కి చెందిన ఓ వాహనం ధ్వంసమైంది. ఇది అంతా పోలీసుల సమక్షంలో జరిగింది. ఇంత జరుగుతున్న పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్న తక్కువ మంది కావడంతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలను నిలువరించలేకపోయారు.
ఇలా గొడవలు జరుగుతుంటే పార్టీల నాయకులు బలాబలాలకు సామాన్యుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల లోపు ఇంకా ఎన్ని గొడవలు చోటు చేసుకుంటాయి అంటూ చర్చించుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నారు.
తిరుపతి జిల్లాకు మరిన్ని కేంద్ర బలగాలు
తిరుపతి జిల్లాకు ఇప్పటికే మూడు కంపెనీల బీఎస్ఎఫ్ కేంద్ర బలగాలు సుమారు 240 మంది వచ్చారు. ఇటీవల జరిగిన పరిణామాలతో జిల్లా ఎన్నికల అధికారి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టి కి తీసుకెళ్ళి మరిన్ని కేంద్ర బలగాలు కావాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మూడు కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు అండమాన్ నికోబార్ నుంచి 230 మంది వరకు ఉంటారు. అదనంగా మరో మూడు కంపెనీలు, తమిళనాడు నుంచి మరో 4000 మంది పోలీసులు రానున్నారు. చిత్తూరు జిల్లాకు సైతం అదనంగా వచ్చే అవకాశం ఉంది. సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి గొడవలు జరిగే ప్రాంతాలకు వీరిని కేటాయించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.