మాజీ మంత్రి శంకర్ నారాయణపై హత్యాయత్నం, పేలుడు పదార్థంతో దుండగుడి దాడి!
మాజీ మంత్రి శంకర్ నారాయణ గడపగడపకు కార్యక్రమం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
పెనుకొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ నారాయణ కాన్వాయ్ పై పేలుడు పదార్థంతో దాడికి యత్నించాడు ఓ దుండగుడు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గుడ్డంపల్లి తండాలో మాజీ మంత్రి శంకర్ నారాయణ గడపగడపకు కార్యక్రమం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమం ముగించుకుని ఊరు దాటుతున్న సమయంలో గుర్తుతెలియని అగంతకుడు కొండలను పేల్చే పేలుడు పదార్థంతో మంత్రి కాన్వాయ్ పై దాడి చేశాడు. అయితే అది పేలక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి వెనుక ఎవరున్నారన్నదానిపై పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గోరంట్ల మండల కేంద్రంలో పెనుకొండ ఎమ్మెల్యే మాల గుండ్ల శంకర్ నారాయణ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తాను ప్రతి గడప గడపకు వెళ్లి జగనన్న చేసిన అభివృద్ధిని చెప్పి, వారికి ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తీర్చానని చెప్పారు. నేడు గడపగడపకు మన ప్రభుత్వం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి గోరంట్ల మండల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోరంట్ల ఎంపీటీసీ, జడ్పిటిసి, సింగల్ విండోలు, సర్పంచులు, ముఖ్య నాయకులు, సచివాలయ కన్వీనర్లు, వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు.