Nara Lokesh: అది ఫేక్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, ఒక్క ఇంటర్నేషనల్ కంపెనీ కూడా లేదు - లోకేశ్
సంతకాలు, పత్రాలు, పేర్లు లేకుండా చీకటి ఎంవోయూలు చేశారని లోకేశ్ అన్నారు. పీలేరులో నిర్వహించిన మీడియా సమావేశంలో లోకేశ్ మాట్లాడారు.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను లోకల్ ఫేక్ సమ్మిట్‌గా నారా లోకేశ్ అభివర్ణించారు. ఎందుకంటే ఆ సమ్మిట్‌లో ఒక్కటి కూడా అంతర్జాతీయ కంపెనీ లేదని విమర్శించారు. ప్రభుత్వం కంపెనీలతో ఒప్పందాలు, పెట్టుబడులు పెట్టే సమయంలో ఆయా పేపర్లపై సంతకాలు చేసి, మీడియాకు చూపిస్తామని, ఈ సమ్మిట్‌లో అలాంటిదేమీ జరగలేదని చెప్పారు. ముఖేష్ అంబానీ విషయంలోనూ కనీసం పుస్తకం తెరిచి సంతకాలు జరగలేదని చెప్పారు. సంతకాలు, పత్రాలు, పేర్లు లేకుండా చీకటి ఎంవోయూలు చేశారని లోకేశ్ అన్నారు. పీలేరులో నిర్వహించిన మీడియా సమావేశంలో లోకేశ్ మాట్లాడారు.
378 కంపెనీలతో ఎంఓయూలు జరిగాయని చెప్పుకుంటుండగా, 70 వరకూ కంపెనీలవి మాత్రమే బయటపెట్టారని విమర్శించారు. గతంలో చంద్రబాబు హాయంలో అందుకోసం ఓ ప్రత్యేక వెబ్ సైట్ ఉండేదని, అందులో ఏ కంపెనీ ఏ స్థాయిలో ఉండేదని వివరించారు. ఇప్పుడు ఆ సౌకర్యాన్ని తీసేశారని చెప్పారు. ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం నడుస్తోందని పారిశ్రామిక వేత్తలు చెప్పారని నారా లోకేశ్ అన్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు నిల్.. గంజాయి ఫుల్ అన్నట్లు పరిస్థితి తయారైందని విమర్శించారు.
ఇప్పటికే ఒప్పందాలు జరిగిన కంపెనీలతో మళ్లీ ఎంవోయూలు కుదుర్చుకున్నారని నారా లోకేశ్ అన్నారు. యువతను వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని లోకేశ్ ఆరోపించారు. దావోస్‌లో జరిగిన ఒప్పందాలను మళ్లీ విశాఖపట్నంలోని గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్‌లో చేసుకున్నట్లు చూపించారని ఆక్షేపించారు. కంచుకోటలో గెలిచి గొప్పలు చెప్పడం కాదని.. వైఎస్ఆర్ సీపీ గెలవని చోట పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు. అలా గెలిచే సత్తా జగన్‌కు ఉందా? అని లోకేశ్ ప్రశ్నించారు. టీడీపీకి గతంలో ఏ మాత్రం పట్టులేని మంగళగిరిలో గెలిచి కంచుకోటగా మారుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పరిశ్రమల ముందు సెల్ఫీ దిగి చూపిస్తున్నానని చెప్పారు. మీరు తీసుకొచ్చిన ఒక్క పరిశ్రమ ముందు అయినా సెల్ఫీ దిగి చూపించగలరా? అని జగన్‌కు గతంలో ఛాలెంజ్ విసిరితే ఆయన స్వీకరించలేదని అన్నారు.
‘‘విశాఖపట్నంలో జరిగింది గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ కాదు. లోకల్ ఫేక్ సమ్మిట్. వైఎస్ఆర్ సీపీ పాలనలో పీపీఏలు రద్దు చేయడంతో పాటు రాష్ట్రం నుంచి పరిశ్రమలను తరిమేశారు. జగన్ సీఎం అయ్యాక బాగుపడింది భారతి సిమెంట్ పరిశ్రమ మాత్రమే. టీడీపీ పాలనలో తెలంగాణ కంటే ఏపీకి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి’’ అని చెప్పుకొచ్చారు.