RK Roja: ఆటో డ్రైవర్ అవతారంలో మంత్రి రోజా, లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు - ముందస్తు బెయిల్ ఎందుకు?
మహిళా ఆటో డ్రైవర్స్ తో సరదాగా సెల్పీలు దిగి, వారితో కలిసి మంత్రి రోజా ఆటో నడిపారు.
చంద్రబాబు, లోకేష్ లు ప్రజల సొమ్ము దోచుకున్నారని, ముందస్తు బెయిల్ కోసం లోకేష్ హైకోర్టును ఎందుకు ఆశ్రయించారో ప్రజలందరికి చెప్పాలని మంత్రి రోజా డిమాండ్ చేశారు. లోకేష్ కు బెయిల్ నిరాకరించిన కోర్టు, విచారణకు సహకరించాలని ఆదేశించడం జరిగిందని రోజా గుర్తు చేశారు. శుక్రవారం (సెప్టెంబర్ 29) తిరుపతి కలెక్టరేట్ లోని ఏపీ సీఎం విజయవాడ నుండి ప్రారంభించిన వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో పర్యాటక శాఖ మంత్రి ఆర్.కే.రోజా లబ్ధిదారులతో కలిసి వీక్షించారు.
అనంతరం మహిళా ఆటో డ్రైవర్స్ తో సరదాగా సెల్పీలు దిగి, వారితో కలిసి మంత్రి రోజా ఆటో నడిపారు. అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత వాహనాలు కలిగిన ఆటో, ట్యాక్సీ, క్యాబ్ వాహన యజమానులకు, డ్రైవర్లకు ఐదో విడత వాహన మిత్రను విజయవాడలోని విద్యాధర పురం నుండి దాదాపు 2,75,930 మంది లబ్ది దారులకు సుమారు 276 కోట్ల రూపాయలను కంప్యూటర్ బటన్ నొక్కి అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందని అన్నారు.
పేద ప్రజలకు తన పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి చలించిపోయి, వాటిని దూరం చేస్తానని వాగ్ధానం చేశారో తాను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుండే అవన్నీ నెరవేరుస్తూ దాదాపుగా 97 శాతం మేర ప్రతి వాగ్ధానాన్ని నెరవేర్చడం జరిగిందని అన్నారు. ఈ రోజుతో 5 విడతలకి కలిపి రూ.1,301 కోట్లను వాహన మిత్ర ద్వారా జమ చేయడం జరిగిందని తెలిపారు. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకే కాకుండా వారి కుటుంబాల్లో చదువుతున్న పిల్లలకు కూడా అమ్మ ఒడి, అర్హులైన మహిళలకు వైఎస్ఆర్ చేయూత, ఆ మహిళలలో ఎవరైనా డ్వాక్రా సంఘాలలో ఉంటే వారికి వైఎస్ఆర్ ఆసరా ఇస్తున్నారని, వారి పిల్లలకి ఫీజ్ రీ ఇంబర్స్మెంట్, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఇంగ్లీష్ మీడియం విద్య అమలుతో పలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఎనలేని మేలు చేస్తున్నారని ఆమె తెలిపారు.
చంద్రబాబు, లోకేష్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మంత్రి రోజా..
చంద్రబాబు, లోకేష్ లు ప్రజల సొమ్మును దోచుకున్నారని, తప్పు చేసిన వారికి ఎక్కడికైనా వెళ్లి నోటీసులు ఇవ్వచ్చని అన్నారు.. ఇప్పటి వరకూ ఏం స్కాం అని ఏమీ తెలియనట్లు మాట్లాడిన లోకేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఎందుకు ఆశ్రయించారో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. తప్పు చేయనప్పుడు బెయిల్ ఎందుకని, లోకేష్ కు బెయిల్ కొట్టి వేసినా కోర్టు విచారణ సహకరించాలని ఆదేశించిందని, దీని బట్టే అర్థం అవుతుందని అన్నారు.
చంద్రబాబు, లోకేష్ లు తప్పు చేశారని ఆమె ఆరోపించారు. లోకేష్ తప్పు చేయనప్పుడు విచారణకు సహకరించేందుకు ఎందుకు భయపడుతున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. యువగళం పాదయాత్రలో టీడీపీ ఏం చేస్తుందో చెప్పకుండా, వెళ్ళిన ప్రతి నియోజకవర్గంలో సీనియర్ నాయకులు, మహిళా నాయకులు అని కూడా చూడకుండా లేని పోని ఆరోపణలు చేయడమే కాకుండా, వారి బట్టలు ఊడదీస్తా, ఉచ్చ పోయిస్తా, అంటూ రౌడీ మాటలు మాట్లాడం జరిగిందని ఆమె విమర్శించారు. జగన్మోహన్ రెడ్డికి భయం ఏంటో పరిచయం చేస్తానని చెప్పినా లోకేష్ ఇవాళ ఎందుకు విచారణకు పోకుండా భయపడుతున్నాడో అర్థం కావడం లేదని, పేద ప్రజలు, మహిళ ఉసురు తగిలి చంద్రబాబు జైల్ కి వెళ్ళారని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు.