Pawan Kalyan Injured: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాలికి గాయం, ఆందోళనలో ఫ్యాన్స్
Pawan Kalyan News: ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాయపడ్డారు. పవన్ కుడి కాలి బొటన వేలికి గాయమైంది. జనసైనికులు, ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Janasena Chief Pawan Kalyan Injured | అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బిజిబిజీగా ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ వార్త అభిమానుల్ని కలవరపెడుతోంది. పవన్ కళ్యాణ్ కాలికి స్వల్ప గాయమైంది. తిరుపతిలో పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేణిగుంట విమనాశ్రయానికి చేరుకున్న తరువాత పవన్ కళ్యాణ్ గాయపడ్డారని సమచారం. ఎయిర్ పోర్టులో అభిమానులకు సెల్ఫీలు ఇస్తున్న క్రమంలో పవన్ కుడి కాలి బొటనవేలికి గాయమైంది.
పవన్ ఎలా గాయపడ్డారు !
రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ కుడికాలి బొటనవేలికి కట్టు కట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కాలికి కట్టుతోనే పవన్ వారాహి విజయభేరి సభల్లో పాల్గొంటున్నారు. జనసేన శ్రేణులు, అభిమానులు సెల్ఫీల కోసం ప్రయత్నించిన సమయంలోనే పవన్ గాయపడ్డారని పార్టీ వర్గాల సమాచారం. ఎన్నికలకు టైమ్ దగ్గర పడటంతో కాలికి కట్టుతోనే ప్రచార సభల్లో పవన్ పాల్గొంటున్నారు. తిరుపతిలో నిర్వహించిన సభలో చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పవన్ కు గాయం కావడంతో జనసైనికులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
కాగా, పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేగా పవన్ గెలుపొందాలని, ఆయనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని టాలీవుడ్ నుంచి మద్దతు లభిస్తోంది. మెగా ఫ్యామిలీ తరహాలోనే కొందరు సినీ సెలబ్రిటీలు నేరుగా పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేస్తున్నారు. నేటి ఉదయం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఓ వీడియో విడుదల చేశారు. ప్రజల కోసం సేవ చేయడానికి ముందు ఉంటారని, పవన్ ను గెలిపించాలని కోరారు. నిర్మాత నాగ వంశీ పిఠాపురం వచ్చి పవన్ తరఫున ప్రచారం చేశారు. జనసేన గాజు గ్లాసుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని కోరారు.