Tumburu Theertham in Tirumala: నేటి నుంచి తుంబుర తీర్థ ముక్కోటి ఉత్సవాలు, ఏడాదిలో రెండు రోజులే అనుమతి
Tirumala Tumburu Theertham: ఏడాదికి రెండు రోజులు పాటు అనుమితించే ప్రత్యేకత గల తుంబుర తీర్థం గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Unknown Facts About Tumburu Theertham- తిరుమల: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి తిరుమల పుణ్యక్షేత్రం దట్టమైన శేషాచలం అడవుల్లో నెలకొని ఉంది. ఈ శేషాచలంలో పలు తీర్ధాలు ఉన్నాయి. అయితే కొన్నింటికి మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ఏడాదికి రెండు రోజులు పాటు అనుమితించే ప్రత్యేకత గల తుంబుర తీర్థం గురించి ఇక్కడ తెలుసుకుందాం.
తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిక్కున సుమారు 14 కిలో మీటర్ల దూరంలో ఈ తుంబుర తీర్థం ఉంది. ఇక్కడికి వెళ్లాలంటే పాపవినాశనం వరకు వాహనాలలో వెళ్లి అక్కడ నుండి నడక మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రాంతానికి ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి గడియలలో మాత్రమే అనుమతిస్తారు. ఈ ఏడాది మార్చి 24న, 25న అనుమతిస్తారు. మార్చి 24వ తేదీ ఉదయం 5 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మార్చి 25వ తేదీ ఉదయం 5 నుండి 11 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ముక్కోటికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేశారు.
స్థల పురాణం
నారద మహర్షి స్వామివారిపై అనర్గళంగా గీతాలు పాడడంతో తుంబురుడు వెనక్కి తగ్గి ఆ తీర్థంలోనే కూర్చుండి పోతారు. అప్పుడు వేంకటేశ్వర స్వామి అక్కడికి వెళ్లి తుంబురుడిని బుజ్జగిస్తారు. దీంతో ఆ తీర్థానికి తుంబురు తీర్థం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. అంతేకాకుండా పూర్వం తుంబురుడు అనే ఒక గంధర్వుడు మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పాలని మహర్షులను ప్రార్ధించాడట. తిరుమలలోని ఈ తీర్థంలో స్నానమాచరించమని వాళ్లు సెలవివ్వడంతో, అలాగే చేసిన ఆ గంధర్వుడు మోక్షాన్ని పొందాడని చెబుతారు. తుంబురుడు మోక్షాన్ని పొందిన తీర్థం కనుక, ఈ తీర్థానికి తుంబుర తీర్థం అనే పేరు వచ్చిందని మరో కధ చెబుతున్నారు. మరోవైపు తరిగొండ వెంగమాంబ స్వామి వారిని పూజించేందుకు ప్రస్తుత అన్నమయ్య జిల్లా వాల్మీకి పురం నుంచి గృహ ద్వారా రాత్రి సమయంలో వచ్చి తుంబురు తీర్థంలోని సాక్షాత్కరించిన శ్రీవారిని పూజించేదని ప్రసిద్ధి. ఇలా వివిధ కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
అడ్వెంచర్ ట్రిప్
తిరుమల నుంచి పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సులను అనుమతిస్తారు. అధిక రద్దీ కారణంగా ప్రైవేటు వాహనాలను రెండు రోజులు పాటు నిలిపివేస్తారు. పాపవినాశనం నుండి 6 కిలో మీటర్లు కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది. దట్టమైన అడవి, ఎతైన కొండలు... ఆకాశాన్ని తాకాయేమో అనేలా పెద్ద పెద్ద చెట్లు.. పక్షుల కిలకిల రాగాలు... పౌర్ణమి చంద్రుడి వెలుగుల్లో బండ రాళ్ళ మీదుగా ప్రయాణించి తీర్ధం చేరుకోవచ్చు. రెండుగా చీలిన కొండ తుంబురు తీర్థానికి దారిని ఇస్తుండగా మధ్యలో ప్రవహించే జలపాతం భక్తులను పరవశింప చేస్తోంది. తీర్ధం ప్రారంభం నుంచి కొండకోనల్లో నుంచి జాలువారిన నీటిలో మునిగిపోయే లోతులో చిన్నపాటి మార్గంలో వెళ్లి.. ఈ పుణ్య తీర్ధం లో స్నానమాచరించడం ద్వారా సమస్త పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. తిరిగి అదే మార్గంలో మరో ఆరు కిలో మీటర్లు నడిచి పాపవినాశనం చేరుకోవచ్చు. ఇక్కడికి రెండు రోజులు పాటు సుమారు లక్ష మందికి పైగా భక్తులు వస్తుంటారు. వీరికి కావాల్సిన వైద్య, ఆహార, భోజన సదుపాయాలు టీటీడీ ఏర్పాటు చేస్తుంది. చిన్న పిల్లలు, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారు మినహా అందరూ చూడాల్సిన ప్రాంతం.