Annamayya District: పెళ్లి మండపంలోనే వరుడిపై యాసిడ్ దాడి- మోసం చేశాడని ప్రియురాలి ఘాతుకం
Crime News: పెళ్లి చేసుకుంటానని మోసం చేశారని పెళ్లి పందిరిలోనే వరుడిపై యాసిడ్ పోసేందుకు యత్నించిదో యువతి. ఆగ్రహంతో ఆ వరుడు ఆమెపై కత్తితో దాడి చేశారు. ఈ గొడవతో ఆ పెళ్లి మండపంలో గందరగోళం నెలకొంది.
Andhra Pradesh: ఈ పెళ్లి ఆపండి... ఇలాంటి డైలాగ్స్ సాధారణంగా సినిమాల్లో వినిపిస్తుంటాయి. కానీ అన్నమయ్య జిల్లా నందలూరులో ఆదివారం లైవ్‌లో జరిగింది. ఓ యువతి పెళ్లి మండపంలోకి రావడంతోనే పెళ్లి ఆపాలని అరుస్తూ... వరుడిపైకి దాడి చేయి బోయింది. ఈ ఘటనతో ఒక్కసారి అక్కడ కలకలం రేగింది. ఆమెను పట్టుకొని ఆరా తీస్తే అసలు విషయం చెప్పింది.
రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ బాషా అనే యువకుడు పదేళ్లుగా తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఇప్పుడు వేరే పెళ్లి చేసుకుంటున్నాడని తిరుపతికి చెందిన యువతి ఆరోపిస్తోంది. కొన్నిరోజుల నుంచి తనతో మాట్లాడకుండా తిరుగుతున్న ఆయన్ని వెతుక్కొని రైల్వే కోడూరు వస్తే పెళ్లి విషయం తెలిసిందని చెప్పింది.
నేరుగా పెళ్లి మండపానికి వచ్చిన ఆ యువతి తన చేతిలో తీసుకొచ్చిన యాసిడ్‌తో బాషాపై దాడి చేయబోయింది. ఆయన తప్పించుకోవడంతో పక్కనే ఉన్న మహిళపై పడింది. తర్వాత వెంట తెచ్చుకున్న కత్తితో కూడా ఆమె దాడికి ప్రయత్నించింది. చుట్టుపక్కల వారు ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో ఆ కత్తిని తీసుకున్న వరుడు ఆమెపై దాడి చేశారు.
పెళ్లి మండపంలో జరిగిన పెనుగలాటలో యువతి మరో మహిళ గాయపడ్డారు. ఇద్దర్నీ స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. ఇద్దరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తేల్చారు.
పెళ్లి మండపంలో జరిగిన గొడవ గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేశారు. ఇరు వర్గాలను స్టేషన్‌కు తరలించారు. వరుడి బంధువులు తిరుపతి అమ్మాయిపై ఫిర్యాదు చేస్తే... తిరుపతి అమ్మాయి వరుడిపై కేసు పెట్టింది. తమకు న్యాయం చేయాలని వధువు బంధువులు కూడా మరో ఫిర్యాదు చేశారు.