బ్రహ్మత్సవాల్లో శ్రీవారి కోసం విదేశీ ఫలాలు- జపాన్ ఆపిల్స్-మస్కట్ గ్రేప్స్, కొరియన్ పియర్స్
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం మధ్యాహ్నం రంగనాయకుల మండపంలో స్నపన తిరుమంజనం జరిగింది.
దేశీయ తృణధాన్యాలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు శ్రీవారి కైంకర్యంలో ఏ విధంగా తరిస్తున్నాయో.. ఈసారి విదేశీ ఫలాలు తిరుమలకు వచ్చాయి. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలలో జపాన్ నుంచి యాపిల్స్, మస్కట్ నుంచి ద్రాక్ష, కొరియా నుంచి పియర్స్, థాయిలాండ్ నుంచి మామిడి, అమెరికా నుంచి చెర్రీస్ తెప్పించారు. స్వామివారి సేవలో వినియోగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీవారిపై ఉన్న భక్తితో వేల కిలోమీటర్ల నుంచి ఈ పండ్లు, పుష్పాలను స్వామివారికి సమర్పించారు.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం మధ్యాహ్నం రంగనాయకుల మండపంలో స్నపన తిరుమంజనం జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై వేంచేపు చేసి సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీటీడీ గార్డెన్ విభాగం ప్రత్యేక అలంకరణలు చేసింది. ఒక్క టన్ను సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, పండ్లుతో వేదికను శోభాయమానంగా అలంకరించారు. అంతే కాకుండా శ్రీ మలయప్ప స్వామివారికి రూపొందించిన పూలమాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మొట్టమొదటిసారిగా, ఫింగర్ మిల్లెట్ (రాగులతో) చేసిన మాల, పచ్చని పవిత్రాలు మరియు పగడపు మాలలతోపాటు స్నపన తిరుమంజనంలో ఏలకులు, వట్టి వేరు, ద్రాక్ష, తులసి దండలు కూడా స్వామి అమ్మవార్లకు అలంకరించారు. గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ ఏడాది థాయ్‌లాండ్‌కు చెందిన లిచిస్, ఆస్ట్రేలియన్ పింక్, బ్లాక్ గ్రేప్స్, వివిధ దేశాలకు చెందిన పండ్లను స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించినట్లు తెలిపారు. నాలుగు రోజుల పాటు చెన్నైకి చెందిన నైపుణ్యం గల పుష్ప కళాకారులు ప్రత్యేక అలంకరణలు చేశారు..