CPI National Secretary Narayana : ఇంటింటికీ వెళ్లి ఓట్లు వెరిఫై చేసిన నారాయణ- దొంగ ఓట్లు సృష్టించిందని వైసీపీపై ఆగ్రహం
CPI National Secretary Narayana: దొంగ ఓట్ల నమోదు కోసం ఓ మహిళకు 18 మంది భర్తలు ఉన్నట్లు నమోదు చేస్తారా అంటూ సీపీఐ నారాయణ ఫైర్ అయ్యారు. ఇలాంటి వాళ్లను ఏం చేసినా పాపం లేదని అన్నారు.
CPI National Secretary Narayana : దొంగ ఓట్ల నమోదు కోసం ఓ మహిళకు 18 మంది భర్తలు ఉన్నట్లు నమోదు చేయడం సిగ్గుచేటని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. దొంగఓట్ల నమోదు అనుమతించిన అధికారులను బహిరంగంగా ఉరి తీసినా పాపం లేదని ఫైర్ అయ్యారు. పట్టభద్రుల ఎన్నికల్లో చదువు అర్హత కల్గిన వారికి ఓటు హక్కు కల్పించకపోగా... అర్హత లేని వారి పేర్లతో జాబితా సిద్ధం చేయడం దారుణం అన్నారు. నారాయణ తిరుపతిలో బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ క్రమంలోనే స్థానిక యశోద నగర్ లో ఓ ఇంట్లో 30, వాలంటీర్ ఇంట్లో 12, మరో ఇంట్లో 8 దొంగ ఓట్లు ఉన్నాయంటూ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సీఎం జగన్ ప్రజాస్వామ్యాన్ని రోడ్డుపై నిలబెట్టి అపహాస్యం చేస్తున్నారని, అరాచక పాలనకు అంతేకాకుండా పోయిందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న అధికార పార్టీ దొంగ ఓట్లక తెరలేపిందన్నారు. ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చే వారి కాళ్లు విరగ్గొట్టాలని సూచించారు. దొంగ ఓటర్ల జాబితా, అర్హత కల్గిన వారికి ఓటు హక్కు కల్పించక పోవడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని... ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు రాయలసీమ ఎన్నికల్లో దొంగ ఓట్ల నమోదు
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటర్ల నమోదు చేశారన్న అంశంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని టెన్త్ పాస్ కాని వాళ్లను కూడా ఓటర్లుగా చేర్చి ఓట్లు వేయించే ప్రయత్ం చేస్తున్నారని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులను గెలిపించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వివిధ పార్టీల నేతలు పెద్ద ఎత్తున ఈ దొంగ ఓట్ల వ్యవహారంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాయలసీమలో పట్టభద్రుల బీజేపీ అభ్యర్థుల తరపున విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్సి విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈ అర్హత లేని ఓటర్ల అంశాన్ని ప్రధానంగా గుర్తించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లను చేర్చారనే ఆరోపణలు
రాయలసీమలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లలో అనేక అక్రమాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం పట్టభద్రులకే్ ఓటర్లుగా నమోదు చేయాలి. కానీ ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్లతో.. కొంత మంది అవినీతి అధికారుల సంతకాలతో దుర్వినియోగానికి పాల్పడి మరీ అర్హత లేని వారిని ఓటర్లుగా నమోదు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికల సంఘం తీరుపై మండిపడ్డారు. రెండు చోట్ల వైఎస్ఆర్‌సీపీ పెద్ద ఎత్తున దొంగ ఓట్లను నమోదు చేసిందని.. దీనికి సచివలాయ, వాలంటీర్ వ్యవస్థలను వాడుకున్నారని ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల సంఘం ఎన్నికలు అపహాస్యం కాక ముందే మేలుకుని ఈ దొంగ ఓటర్లను గుర్తించి ఓటు వేయకుండా నిరోధించాలని ఆయన కోరుతున్నారు.