తిరుమల క్యూలైన్‌లో ఘర్షణ- కొట్టుకున్న తమిళనాడు, గుంటూరు భక్తులు
తిరుమలలో భక్తుల మధ్య కొట్లాట జరిగింది. బాత్రూమ్‌కు వెళ్లే విషయం రెండు వర్గాల మధ్య పోట్లాటకు దారి తీసింది.
శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో ఉన్న భక్తుల మధ్య ఘర్షణ తలెత్తింది. తమిళనాడుకు చెందిన భక్తుల దాడిలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. గుంటూరు నుంచి వచ్చిన భక్తులపై తమిళనాడుకు చెందిన వారు దాడి చేసినట్టు తెలుస్తోంది. బాత్ రూమ్ వెళ్ళేందుకు దారి ఇవ్వమని అడిగిన సందర్భంలో మాటామాట పెరిగి దాడుల వరకు వెళ్లినట్టు సమాచారం. ముందు తోపులాట జరిగిందని అంది కాస్త దాడికి దారి తీసిందని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన భక్తులు ఎక్కువ మంది ఉండటంతో దాడి చేశారని అంటున్నారు. తోటి భక్తులు చెబుతున్నా వినకుండా దాడి చేశారని బాధితులు వాపోతున్నారు. ఈ సంఘటన తర్వాత క్యూలైన్లలో నిల్చున్న భక్తులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు.
భక్తుల రద్దీ సాధారణమే
తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. ప్రతి సోమవారం నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను టీటీడీ రద్దు చేసింది. విగ్రహాల పరిరక్షణలో భాగంగా ఆగమ సలహాదారుల సూచనల మేరకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆదివారం 09-10-2022 రోజున 86,188 మంది స్వామి వారి దర్శించుకున్నారు. 41,032 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, 5 కోట్ల రూపాయలు భక్తులు హుండీ స్వామి వారికి ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోయి టిబిసి వరకూ బయట క్యూలైన్స్ లో వేచి ఉన్నారు భక్తులు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.
హైదరాబాద్‌లో వైభవోత్సవాలు
తిరుమలకు వచ్చే భక్తులందరూ స్వామివారికి జరిగే నిత్య, వారోత్సవాలు తిలకించడం సాధ్యంకాదు. వయోభారం, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అనేక మంది స్వామివారిని ఎక్కువ సార్లు చూసి తరించే అవకాశం ఉండదు. భక్తులకు ఈ లోటు లేకుండా చేయడం కోసం తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే నిత్య, వార సేవలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా పలు ప్రాంతాల్లో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను టిటిడి నిర్వహిస్తోంది. కరోనా కారణంగా రెండున్నర ఏళ్ల విరామం తరువాత నెల్లూరు నగరం నుంచి ఈ ఉత్సవాలను టిటిడి పునఃప్రారంభించింది.
ఈ వేడుకను ఈనెల హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అక్టోబరు 11 నుంచి 15వ తేదీ వరకు జరుగనున్న శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలకు సర్వం సిద్ధమైంది. తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే సేవలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా టిటిడి శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తోంది.
విస్తృత ఏర్పాట్లు
నమునా ఆలయం వద్ద సేవల నిర్వహణకు ఆకట్టుకునేలా స్టేజి ఏర్పాటు చేశారు. భక్తులు కూర్చుని సేవలను దర్శించేందుకు వీలుగా కుర్చీలు, ఎండకు, వర్షానికి ఇబ్బంది లేకుండా విశాలమైన జర్మన్ షెడ్ ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. శ్రీవారి కల్యాణోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందువల్ల అన్నప్రసాదాల వితరణ కోసం క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు.