NV Ramana In Tirumala: శ్రీవారి సేవలో సీజేఐ ఎన్వీ రమణ, మహమ్మారులు రాకుండా చూడాలని స్వామివారికి ప్రార్థన
NV Ramana Visits Tirumala: వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి సీజేఐ ఎన్వీ రమణ శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుపతి : కలియుగ ప్రత్యక్ష దైవం చిత్తూరు జిల్లా తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ మహా ద్వారం వద్ద చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి, ఆలయ అర్చకులు ఇస్తికఫల్ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ మర్యాదలతో స్వామి వారి దర్శనభాగ్యం కల్పించారు.
దర్శనానంతరం జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి జస్టిస్ ఎన్వీ రమణను పట్టువస్త్రంతో సత్కరించారు. టీటీడీ ఈవో జవహర్ రెడ్డి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక క్షేత్రం పరిశుభ్రంగా ఉందని, సుందీకరణ మెరుగ్గా చేశారన్నారు. భవిష్యత్తులో కొవిడ్ లాంటి మహమ్మారులు రాకుండా ప్రపంచాన్ని కాపాడాలని శ్రీవారిని సీజేఐ ప్రార్థించారు. దర్శనం అనంతరం పద్మవతి అతిథిగృహం చేరుకొని అల్పాహారం స్వీకరించి కొద్ది సేపు విశ్రాంతి అనంతరం పద్మావతి అతిధి గృహం నుండి రేణిగుంట విమానాశ్రయానికి తిరుగు ప్రయాణం కానున్నారు.
శ్రీవారి సేవలో ప్రముఖులు..
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, టీడీపీ ఎమ్మెల్సీ రామారావు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్, పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ లు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా... ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.
శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్, మహేశ్వరీ (Janhvi Kapoor at Tirumala)
తన పుట్టినరోజు సందర్భంగా శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమలలో పర్యటిస్తున్నారు. తన బంధువు, సీనియర్ నటి మహేశ్వరితో కలిసి నేటి ఉదయం వీఐపీ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేదపండితులు వేదాశీర్వచనం అందించగా... ఆలయ అధికారులు తీర్త ప్రసాదాలు అందజేశారు.
Also Read: Delhi High Court: ఆ కోడలికి అత్తవారింట్లో నివసించే హక్కు లేదు: ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
Also Read: Weather Updates: 28 ఏళ్లలో తొలిసారిగా అల్పపీడనం - ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు - కూల్ కూల్‌గా తెలంగాణ