Chittoor News: కర్ణాటకలో ఎన్నికల వేళ ఏపీలో దుండగుల మాస్టర్ ప్లాన్! పోలీసులకు అడ్డంగా బుక్
అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నకిలీ పోలీసులు ముఠా అరెస్టుకర్ణాటక పోలీసులం అంటూ లక్షల్లో నగదు కాజేసిన నకిలీ పోలీసు ముఠా
AP - Karnataka Boarder: ఆంధ్రా - కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో నకిలీ పోలీసులు హల్ చల్ చేశారు.. ఖాకీ చొక్కా ముసుగులో ఆంధ్ర - కర్ణాటక సరిహద్దులో వాహనాలను తనిఖీ చేసి నగదు వసూలు చేసేవారు. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో పోలీసులం (Fake Police) అంటూ నాయకులను టార్గెట్ చేసుకుని నగదును అందిన వరకూ దోచుకుని పరార్ అవుతారు.. చిత్తూరు జిల్లా పోలీసులకు వచ్చిన సమాచారం మేరకూ ఆంధ్ర సరిహద్దులో కాపు కాసిన నకిలీ పోలీసుల ముఠాను పట్టుకున్నారు.
పలమనేరు (Palamanair) డీఎస్పీ సుధాకర్ రెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నేడు ఉదయం (మే 4) వీ కోటలోని పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి నిందితులను చూపించారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా, వీకోట మండలం సరిహద్దు ప్రాంతంలోని కర్ణాటక బార్డర్ సమీపంలో గత నెల 5వ తేదీన కర్ణాటక పోలీసులు అంటూ కర్ణాటక రాష్ట్రం, శ్రీనివాసపురానికి చెందిన రియాజ్ భాషా అనే వ్యక్తి నుంచి ఐదు లక్షలు రూపాయల నగదును నకిలీ పోలీసు ముఠా సభ్యులు మోసం చేసి లాక్కెళ్లారు.. గత కొద్ది నెలలుగా వి.కోట మండలం, దాసర్లపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో నకిలీ పోలీసులు దోపిడీలకు పాల్పడుతున్నట్లు వికోట పోలీసులకు సమాచారం వచ్చింది. ఆ మేరకు డీఎస్పీ సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో వి.కోట సీఐ ప్రసాద్ బాబు నేత్రుత్వంలో బాధితుడు ఇచ్చిన సమాచారం మేరకు పట్రపల్లి చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేశారు. కేజీ ఆఫ్ రోడ్డు వైపు నుంచి వీకోట వైపుకు వస్తున్న ఓ వాహనం పోలీసులను చూసి తిరిగి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా వీకోట పోలీసులు అడ్డుకొని నకిలీ పోలీసు ముఠాను అదుపులో తీసుకున్నారు.
పోలీసుల స్టైల్‌లో విచారణ జరిపితే బయట పడిన అసలు విషయం..
నకిలీ పోలీసు ముఠాలను (Fake Police) పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా, తాము కర్ణాటక నుంచి వచ్చామని, ఆంధ్ర- కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో పరిసర ప్రాంతాల్లో రాక పోకలు సాగించే వాహనదారులను నిలిపి వారిని బెదిరించి వారి దగ్గర నుండి నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటుగా, ఐదు వందల రూపాయల నోట్లకు బదులుగా రెండు వేల రూపాయల నోట్లను ఇస్తామని నమ్మిబలికేవారమని తెలిపారు. వారి వద్ద నుండి నగదును తీసుకుని అక్కడ నుండి పరార్ అయ్యే వాళ్ళమని పోలీసుల విచారణలో నకిలీ పోలీసులు వెల్లడించారు.
రూ.500 నోట్లను 2 వేల నోట్లుగా మార్చే క్రమంలో కర్ణాటక శ్రీనివాస పురానికి చెందిన రియాజ్ 500 రూపాయలు నోట్లతో కూడిన ఐదు లక్షల రూపాయలు తీసుకెళ్లగా అవి కాజేసినట్లుగా నిందితులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నకిలీ పోలీసుల ముఠాపై ప్రత్యేక దృష్టి సారించిన చిత్తూరు జిల్లా పోలీసులు, ఓ డీఎస్పీ, ఓ సీఐ, ఓ ఎస్సై, ముగ్గురు కానిస్టేబుల్స్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు.