Cheetah Wandering: ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలో చిరుత కలకలం, భయాందోళనలో విద్యార్థులు!
Cheetah Wandering: తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్శిటీలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. యూనివర్సిటీ పరిపాలన భవనంలో నిన్న అర్ధరాత్రి చిరుతు ఓ శునకాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించింది.
Cheetah Wandering: తిరుపతి ఎస్వీ వెటర్నరీ యూనివర్శిటీలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. యూనివర్సిటీ పరిపాలన భవనం ఆవరణలో మంగళవారం అర్ధరాత్రి చిరుత సంచరించింది. అక్కడ నిద్రిస్తున్న ఓ శునకాన్ని పట్టుకునే ప్రయత్నం కూడా చేసింది. అయితే ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. నిన్న అర్ధరాత్రి సంచరించిన చిరుత జాడను ఇవాళ సాయంత్రం యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన సిబ్బంది... యూనివర్సిటీ వద్దకు చేరుకొని చిరుత జాడలను గుర్తించారు. మరోసారి చిరుత యూనివర్సిటీ ఆవరణంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక గ్రామాల ప్రజలు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు పులిని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆరు నెలల కిందట తొలిసారి..
గత ఆరు నెలల కిందట యూనివర్సిటీలోని ఆవరణలో, సమీపంలోని పంట పొలాల్లో చిరుత సంచరించడం స్ధానికులు గమనించారు. అప్పుడు కూడా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే అదే రోజు యూనివర్సిటీలోని ఓ శునకంపై దాడి చేసి గాయ పరచడంతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు.
అనకాపల్లిలోనూ కలకలం సృష్టిస్తున్న చిరుత
అనకాపల్లి జిల్లా (Anakapalle District) యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దపల్లి - కొక్కిరాపల్లి రిజర్వు ఫారెస్ట్ పరిసరాల్లో నెల రోజుల కిందట పెద్ద పులి సంచరిస్తున్నట్టు అటవీ శాఖాధికారులు వెల్లడించారు. స్థానికుల సమాచారం మేరకు పులి సంచరించిన ప్రాంతాన్ని డీఎఫ్‌ఓ అనంత శంకర్ పరిశీలించారు. భారీగా కురిసిన వర్షం కారణంగా నేలపై పులి సంచరించిన ప్రదేశంలో కాలి ముద్రలు స్పష్టంగా కనిపించాయని తెలిపారు. పెద్దపల్లి, మంత్రిపాలెం, గొల్లలపాలెం, కొక్కిరాపల్లి గ్రామాల పరిసర ప్రాంతాల్లోనే పులి సంచరిస్తున్నట్టు పేర్కొన్నారు. పులికి ఎదురు తిరగడం, చప్పుళ్లు చేయడం వంటి పనులు ఎవ్వరూ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. పులి కదలికలను గుర్తించడానికి ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పులి సంచారం విషయం తెలిసి యలమంచిలి మండల వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పొలాల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు.
తెలంగాణలో ద్విచక్ర వాహనాన్ని వెంబడించిన పులి..
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం డికంపల్లి శివారులో నెలరోజుల క్రితం చిరుత కలకలం సృష్టించింది. రామస్వామి క్యాంపుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రాజు ఓ రోజు రాత్రి మాక్లూర్ మండలం గాంధీనగర్ కు వెళ్లి తిరిగి వస్తుండగా, సుమారు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో చెట్ల పొదలలో నుంచి చిరుత రాజు ప్రయాణిస్తున్న బైక్ పై పంజా విసిరింది. రాజుతో పాటు ప్రయాణిస్తున్న అజయ్ తో కలిసి ఇద్దరు గట్టిగా కేకలు వేయడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది. దీంతో వీరు తప్పించుకొని గ్రామానికి చేరుకున్నారు. అనంతరం మాక్లూర్ పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటనను పోలీసులకు వివరించారు. అధికారులు చిరుతను పట్టుకోవడానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read: Thunderstorm: ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం - పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం