Chandrababu: కుప్పం ద్రవిడ వర్సిటీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై చంద్రబాబు ఆరా
కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో కలుషిత ఆహారం విద్యార్థులకు సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.
అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ ఘటపై టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. కలుషిత ఆహారం విద్యార్థులకు సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ద్రవిడ వర్సిటీలో ఫుడ్ పాయిజన్ కావడంపై కుప్పం పార్టీ నేతలను చంద్రబాబు ఆరా తీశారు. ద్రవిడ యూనివర్సిటీలోని అక్కమహాదేవి లేడీస్ హాస్టల్ విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ అయిన కారణంగా అసుపత్రి పాలయ్యారు. మధ్యాహ్నం భోజనం చేసిన వారిలో దాదాపు 25 మంది అసుపత్రి పాలైనట్లు స్థానిక నేతలు చంద్రబాబుకు వివరించారు.
ఫుడ్ పాయిజన్‌కు గురైన విద్యార్థినుల ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి, వారికి అందుతున్న వైద్య సాయంపై చంద్రబాబు నేతలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన వారిలో ముగ్గురు విద్యార్థినులు తీవ్ర అనారోగ్యం పాలయ్యారని నేతలు వివరించారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించేందుకు తగిన సహాయ సహకారాలు అందించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. విద్యార్థులు తినే ఆహారం కలుషితం అయిన ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యం స్పందించాలని చంద్రబాబు అన్నారు.
కలుషిత ఆహారం సరఫరాకు కారణం అయిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ నిర్లక్ష్యంతో విద్యార్ధినుల ప్రాణాల మీదకు తెచ్చిన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థినులు ఆసుపత్రి పాలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చంద్రబాబు అన్నారు. విద్యార్థినులు చికిత్స పొందుతున్న కేసీ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ డాక్టర్లతో చంద్రబాబు స్వయంగా మాట్లాడి వివరాలు ఆరా తీశారు. ద్రవిడ వర్సిటీ ఘటనను దాచిపెట్టేందుకు అధికారులు ప్రయత్నం చేశారన్న సమాచారంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: CBI Vs AP Police : వివేకా కేసు విచారిస్తున్న సీబీఐ ఎస్పీపై పోలీస్ కేసు ! తర్వాత ఏంటి ?