Singer Sravana Bhargavi: శ్రావణ భార్గవిపై బీజేపీ లీడర్ ఫైర్, ఇంకోసారి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
సింగర్ శ్రావణ భార్గవి తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తన 'ఒకపరి కొకపరి వయ్యారమై' పాటతో విభిన్న అభినయం ప్రదర్శించిన సంగతి తెలిసిందే.
శ్రావణ భార్గవి అంశంపై బిజెపి అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. శ్రీవారి ఆలయం ముందు భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు తాళ్లపాక అన్నమాచార్యలని అన్నారు.. 32 వేల సంకీర్తనలు స్వామి వారిపై భక్తితో ఆలపించారన్నారు. కొందరు భుక్తి కోసం స్వామి వారి సంకీర్తనలు ఇష్టానుసారం కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. సంగీత కళాకారులైన శ్రావణ భార్గవి సైతం స్వామి వారి కీర్తనలను తినుబండారాలు తింటూ కాళ్ళు ఊపుతూ చిత్రీకరించడం సబబు కాదన్నారు.. ఇలాంటి పనులు చేసే సమయంలోనే ఆలోచించాలని సూచించారు. భక్తితో పాడితే ఆలయంలో పాడాలి, ఇలా ఇంట్లో పడుకొని ఎవరు పాడరని చెప్పారు. అన్నమయ్య సంకీర్తనలపై టీటీడీ, అన్నమయ్య వంశస్థులు పేటెంట్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.. స్వామి వారి పాదాలకు అంకితం చేసిన కీర్తనలు ఇష్టానుసారం వినియోగించరాదని అన్నారు. అలా ఎవరైనా వినియోగిస్తే టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
సింగర్ శ్రావణ భార్గవి తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తన 'ఒకపరి కొకపరి వయ్యారమై' పాటతో విభిన్న అభినయం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఆ కీర్తనను వెకిలీ చేష్టలతో చిత్రీకరించి వీడియో రిలీజ్ చేసిందని అన్నమయ్య వంశస్తులు ఆమెపై మండిపడ్డారు. ఈ విషయంపై కోర్టుకు కూడా వెళతామని హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఆ వీడియోలో ఎలాంటి తప్పు లేదని, అది మీ చూపులోనే ఉందని, దుప్పటి కప్పుకున్నా అశ్లీలంగానే కనిపిస్తుందని శ్రావణ భార్గవి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది. ఆ వీడియోను యూట్యూబ్ నుంచి డిలీట్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. వీడియోను డిలీట్ చేసేది లేదని శ్రావణ భార్గవి తేల్చిచెప్పింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన తిరుపతి వాసులు గళం విప్పారు. శ్రావణ భార్గవి తీరుపై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొంత మంది నిరసనలు కూడా తెలిపారు.
దీంతో కాస్త వెనక్కి తగ్గిన శ్రావణ భార్గవి తన యూట్యూబ్ ఛానెల్ నుంచి 'ఒకపరి కొకపరి వయ్యారమై' వీడియోను డిలీట్ చేసింది. శ్రావణ భార్గవి ఓ మెట్టు దిగి ఆ వీడియోను తొలగించడంతో తిరుపతి వాసులు, అన్నమయ్య వంశస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.