Atchannaidu: ఆ రూ.9.5 లక్షల కోట్లు ఏం చేశావు బటన్ సీఎం జగన్?: అచ్చెన్నాయుడు సూటిప్రశ్న
ఏపీ చరిత్రలో చంద్రబాబు వరకు పరిపాలించిన సీఎంలు అంతా కలిసి రూ.2.7 లక్షల కోట్లు అప్పులు చేస్తే, సీఎం జగన్ కేవలం నాలుగేళ్లలోనే రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు.
దేశ చరిత్రలో మొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు వ్యతిరేకిస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీ చరిత్రలో చంద్రబాబు వరకు పరిపాలించిన సీఎంలు అంతా కలిసి రూ.2.7 లక్షల కోట్లు అప్పులు చేస్తే, సీఎం జగన్ కేవలం నాలుగేళ్లలోనే రూ.10 లక్షల కోట్లు అప్పులు, పన్నుల రూపంలో వసూలు చేసినవి రూ.1.5 లక్షల కోట్లు. ఇందులో జనాల ఖాతాల్లో రూ.1.5 లక్షల కోట్లు వేశారన్నారు ఓకే, మిగతా 9.5 లక్షల కోట్లు ఏం చేశారో చెప్పాలని సీఎం జగన్ ను ప్రశ్నించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై పుట్టపర్తిలో టిడిపి జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.
జగన్ సీబీఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు !
వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరిగిన ఏ ఒక్క ఎన్నిక కూడా సక్రమంగా జరగలేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన సీఎం జగన్ ను ఇంటికి పంపేందుకు రాష్ట్రంలో ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. అధికారం కోసం సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని పొట్టన పెట్టుకున్న జగన్.. అధికారంలోకి వచ్చిన వెంటనే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారని, త్వరలోనే విచారణలో ఇదే తేలుతుందన్నారు. ఒకవేళ ఈ కేసుతో సంబంధం లేకుంటే తానే సీబీఐ ఎంక్వైరీ వేసి న్యాయం జరిగే వరకు పోరాటం చేసేవాళ్లు అన్నారు.
గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా ఏపీ..
గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా రాష్ట్రాన్ని మార్చేశారని, యువత గంజాయి మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటోందని అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని ప్రస్తుత పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాలంటే.. అభిప్రాయ భేదాలు పక్కనబెట్టి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. జగన్ బటన్ సీఎం అని ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఓటర్లు టీడీపీకి ఓట్లు వేసి జగన్ ను ఇంటికి పంపించాలన్నారు. నాలుగేళ్లు గడిచాయి.. కానీ జగన్ నోరు తెరిస్తే బటన్ నొక్కా అంటారు. ప్రజలకు డబ్బులు వేశా అంటానని సీఎం చెబుతున్నారు కానీ, కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇతర ఛార్జీలు పెంచుతూ ప్రజల రక్తాన్ని పీల్చుతున్న నేత సీఎం జగన్ అంటూ మండిపడ్డారు.
వివేకా హత్య కేసులో జగన్ న్యాయం చేయడం లేదని, మాజీ ఎంపీ కూతురు కోర్టులను ఆశ్రయించి తన పోరాటంలో సీబీఐ ఎంక్వైరీ వేయించారని అచ్చెన్నాయుడు చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే, వివేకా హత్యతో సంబంధం లేకపోయి ఉంటే ఎవరూ అడగకున్నా జగన్ ఎంక్వైరీ చేయించి దోషులను తేల్చేందుకు యత్నించేవారు. చివరగా ఏపీలో వివేకా కేసుపై విచారణ సరిగా జరగడం లేదని, విచారణను తెలంగాణకు బదిలీ చేశారని వ్యాఖ్యానించారు. మరోవైపు జగన్ చేసిన అప్పులు రూ.10 లక్షల కోట్లు, పన్నులు రూ.1.5 లక్షల కోట్లు ఉన్నాయని.. అందులో లక్షన్నర కోట్లు ప్రజల ఖాతాల్లో వేసినట్లయితే.. మిగిలిన తొమ్మిదిన్నర లక్షల కోట్లు ఏమయ్యాయి, ఏం చేశారో చెప్పాలని సీఎం జగన్ ను ప్రశ్నించారు. నాలుగేళ్లలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా కట్టలేదని, ప్రజలు ఈ విషయాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి మోసపూరిత వైసీపీ ప్రభుత్వాన్ని దారుణంగా ఓడించాలని పిలుపునిచ్చారు.