RK Roja: నన్ను బలహీన పరిచే కుట్ర జరుగుతోంది, పాలిటిక్స్ చాలా కష్టం: మంత్రి రోజా ఆడియో వైరల్
AP Minister Roja: నగరి వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. తనకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో పనులు జరగడంపై మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP Minister Roja Audio Viral: తనను బలహీన పరిచే కుట్ర జరుగుతోందంటూ ఏపీ మంత్రి ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం వైఎస్సార్ సీపీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. తనకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో పనులు జరగడంపై మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు దేశం, జనసేన పార్టీ నేతలు నవ్వుకునే విధంగా భూమి పూజ జరిగిందంటూ మంత్రి రోజా మాట్లాడినట్లు ఓ ఆడియో వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే..
నగరి నియోజకవర్గం నిండ్ర మండలం కొప్పేడులో రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే రోజా లేకుండానే రైతు భరోసా కేంద్రానికి శ్రీశైలం బోర్డు చైర్మెన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కేజే శాంతి హాజరయ్యారు. తనకు సమాచారం ఇవ్వకుండా, కార్యక్రమానికి ఆహ్వానం లేకుండా భూమి పూజ చేయడంపై రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తనను బలహీన పరిచేందుకు కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు.
వైరల్ అవుతోన్న ఆడియోలో ఏముందంటే !
‘ఇలాంటి సమయంలో మంత్రి అయిన తనను నియోజకవర్గంలో బలహీన పరిచే విధంగా కుట్ర జరిగింది. జనసేన, టీడీపీ నవ్వుకునే విధంగా ఆ పార్టీలకు మద్దతయ్యేలా, తనకు నష్టం జరిగేలా.. పార్టీని దిగజారుస్తూ వీళ్లు భూమి పూజ ఎంతవరకు కరెక్ట్. మీరంతా ఆలోచించాలి. పార్టీలో ఇలాంటి వాళ్లు కంటిన్యూ అయితే మేం రాజకీయాలు చేయడం కష్టం. మేం ప్రాణాలు పెట్టి పార్టీ కోసం పని చేస్తుంటే, ప్రతిరోజూ మెంటల్ టెన్షన్ పెడుతూ.. అన్ని రకాలుగా మాకు, పార్టీకి నష్టం జరుగుతుంటే వీళ్లు పార్టీ నాయకులు అని ప్రోత్సహించడం బాధేస్తోంది’ అని మంత్రి రోజా అన్నట్లుగా ఉన్న ఆడియో వైరల్ అవుతోంది.
రోజా క్లారిటీ కోసం పార్టీ నేతలు, ఫ్యాన్స్ వెయిటింగ్ !
వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజా లాంటి కీలక మహిళా నేత ఇలాంటి కామెంట్లు చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది. ప్రత్యర్థి పార్టీలకు సైతం దీటుగా బదులిచ్చే రోజా సొంత పార్టీలో వర్గ పోరును ఎదుర్కోలేక పోతున్నారా అని సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. మరోవైపు వైరల్ అవుతున్న ఆడియో మంత్రి రోజా మాటలేనా, కాదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మంత్రి రోజా ఈ ఆడియోపై అధికారికంగా స్పందించలేదు.
ఏపీలో పలు నియోజకవర్గాల్లో అధికార వైసీపీలో వర్గ విభేదాలున్నాయి. కొన్నిచోట్ల కొత్త నేతలు పార్టీలో చేరడం వల్ల సిట్టింగ్ లకు తలనొప్పిగా మారగా.. మరికొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు, ఈసారి సీటు దక్కించుకునేందుకు, పార్టీ అధినేత మెప్పు పొందేందుకు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్న నేతలు సైతం ఉన్నారు. కొన్నిచోట్ల సొంత పార్టీ నేతల మధ్య వివాదాలు, విభేదాలతో హత్యల వరకు దారితీసిన ఘటనలు ఏపీలో జరుగుతూనే ఉన్నాయి.