Tirumala News: కాలినడకన తిరుమలకు అమరావతి రైతులు, రేపు శ్రీవారి దర్శనం
Amaravati Farmers: అమరావతి రైతులు శనివారం (జూలై 13) తిరుపతికి చేరుకున్నారు. ఆదివారం అలిపిరి కాలిబాట ద్వారా తిరుమలకు చేరుకున్నారు. స్వామివారికి మొక్కు చెల్లించనున్నారు.
Telugu News: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమరావతి పునర్ వైభవానికి మార్గం సుగమం కావడంతో రాజధాని ప్రాంత రైతులు తమ మొక్కు తీర్చుకున్నారు. అమరావతి రైతులు కృతజ్ఞత పాదయాత్ర రూపంలో తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం అలిపిరి నడకమార్గం నుంచి తిరుమలకు వెళ్లారు. గత నెల 24న అమరావతి వెంకటపాలెం నుంచి వీరంతా కలిసి పాదయాత్ర ప్రారంభించారు. దాదాపు 30 మంది రైతులు గత 17 రోజులుగా 433 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించారు.
అలా వారు శనివారం (జూలై 13) తిరుపతికి చేరుకున్నారు. ఆదివారం అలిపిరి కాలిబాటలో తిరుమలకు చేరుకున్నారు. స్వామివారికి మొక్కు చెల్లించనున్నారు. రేపు సోమవారం శ్రీవారిని దర్శించుకోనున్నారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు పోరాడిన సంగతి తెలిసిందే. వారు న్యాయస్థానం - దేవస్థానం పాదయాత్రను విజయవంతంగా గతంలో సాగించారు. ఏపీ హైకోర్టు నుంచి తిరుమలకు మహాపాదయాత్రగా వెళ్లారు.
తిరుమలలో పెరిగిన రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. జూలై 13న ఒక్కరోజే దాదాపు 75,916 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. 42,920 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా ఆదాయం 3.87 కోట్లు రాగా.. శ్రీవారి సర్వదర్శనానికి సమయం దాదాపు 24 గంటలు పడుతోంది.