Jayaprada: తిరుమలలో జయప్రద, ఏపీ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
Tirumala News: జయప్రద ఆదివారం (ఏప్రిల్ 28) తిరుమల ఆలయానికి వచ్చారు. దర్శనం తర్వాత ఆలయ రంగనాయకుల మండపంలో జయప్రదకు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం జయప్రద మీడియాతో మాట్లాడారు.
AP Elections 2024: సీనియర్ సినీ నటి జయప్రద ఏపీ రాజకీయాలపైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఆదివారం (ఏప్రిల్ 28) తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు జయప్రదరకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత ఆలయ రంగనాయకుల మండపంలో జయప్రదకు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన జయప్రద మీడియాతో మాట్లాడారు.
బంగారు ఆంధ్రప్రదేశ్ కావడంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని తాను దేవుడ్ని వేడుకున్నానని జయప్రద చెప్పారు. ప్రజలకు అందాల్సిన కనీస సదుపాయాలు విద్య, వైద్యం అందరికీ అందాలని కోరానని అన్నారు. వ్యవసాయం లాభసాటిగా అందించేలా చూడాలని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆహ్వానిస్తే తాను బీజేపీ అభ్యర్థుల తరపున ఏపీలో ప్రచారం చేయడానికి రెడీ అని చెప్పారు. బీజేపీ హైకమాండ్ తనకు ఏ బాధ్యత అప్పగించినా అది నెరవేర్చడానికి పని చేస్తానని జయప్రద అన్నారు.
గత వారం కూడా తిరుమలలో జయప్రద
ఈ నెల మొదట్లో కూడా జయప్రద తిరుమలకు వచ్చారు. ఆ సమయంలో ఆమె మాట్లాడుతూ.. అవకాశం ఇస్తే ఏపీ నుంచి పోటీచేయడానికి కూడా తాను రెడీ అని అన్నారు. గత ఏప్రిల్ 3న ఆమె పుట్టిన రోజు సందర్భంగా జయప్రద శ్రీవారిని దర్శించుకున్నారు. తాను ప్రస్తుతం బీజేపీలో ఉన్నానని.. ఏపీలో అవకాశం ఇస్తే పోటీచేస్తానని అన్నారు. ఎక్కడ ఉన్నా కూడా తాను మాత్రం ఆంధ్రా బిడ్డనేనని జయప్రద చెప్పారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా నిర్ణయం మేరకు తాను నడుచుకుంటానని అన్నారు. ఏపీలో ఎవరైతే రాజధాని తీసుకు రాగలరో, ఎవరైతే యువకులకు ఉద్యోగాలు, మహిళలకు రక్షణ కల్పించగలరో వారే అధికారంలోకి రావాలని ఆశించారు. కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు జయప్రద చెప్పారు.
ఎన్టీఆర్ హాయాంలో టీడీపీ ద్వారా రాజకీయ జీవితాన్ని జయప్రద ప్రారంభించారు. ఆ తరువాత యూపీలో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. అక్కడి నుంచి ఆర్ఎల్‌డీలో చేరారు. 2019లో జయప్రద బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మే 13వ తేదీన లోక్‌సభ ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.