AP SSC Paper Leak : మాల్ ప్రాక్టీస్ కోసమే పదో తరగతి పేపర్ లీక్, ర్యాంకుల కోసం ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాకం
AP SSC Paper Leak : చిత్తూరు జిల్లాలో పదో తరగతి తెలుగు పేపర్ లీక్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు గ్రూపుగా ఏర్పడి మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
AP SSC Paper Leak : ప్రతి ఏడాది జరిగే పదో తరగతి పరీక్షల్లో ర్యాంకుల కోసం ప్రైవేటు యాజమాన్యాలు పోటీ పడుతుంటారు. ఎలాగైనా తమ కళాశాల విద్యార్థులు అధిక శాతం మార్కులు సాధించి నెంబర్ వన్ లో నిలవాలని విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. అయితే రెండేళ్ల తరువాత ఏపీలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షల్లో తమ పాఠశాల విద్యార్థులు అధిక మార్కులు సాధించాలని కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు అడ్డదారిలో మాల్ ప్రాక్టీసుకు పాల్పడుతున్నాయి. ఈ నెల 27వ తేదీన నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. క్వశ్చన్ పేపర్ల ఫొటోలు తీసి మాల్ ప్రాక్టీసుకు పాల్పడుతూ చిత్తూరు టాకీస్ మీడియా గ్రూప్ లో పోస్టు చేశారు. ఈ ఘటనపై చిత్తూరు డీఈవోకి అందిన ఫిర్యాదుతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బృందాలుగా ఏర్పడిన పోలీసులు మాల్ ప్రాక్టీసుకు కారకుడైన నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు కుట్ర పూరితంగా మాల్ ప్రాక్టీసుకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. ఒక గ్రూపుగా ఏర్పడి అక్రమ మార్గాల్లో పదో తరగతి ప్రశ్నా పత్రాలను ముందుగా బయటకు పంపేందుకు పవన్ అనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి రూ.పది వేల నుంచి పదిహేను వేల వరకూ ఇస్తూ ప్రైవేటు యాజమాన్యాలు తమ ఆధీనంలో ఉంచుకున్నాయని పోలీసుల విచారణలో తేలింది.
మాల్ ప్రాక్టీసు ఎందుకు?
ఎలాగైనా తమ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు తెలుగులో అధిక మార్కులు రావాలనే ఉద్దేశంతో కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్డదారులు తొక్కుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. అధిక మార్కులు రప్పించి వారి సంస్థలకు మంచి పేరు, అధిక మొత్తంలో అడ్మిషన్స్ పొందేందుకు ఒక గ్రూపుగా ఏర్పడి పదో తరగతి పేపర్లు మాల్ ప్రాక్టీసుకు పాల్పడ్డారన్నారు. చిత్తూరు జిల్లా జి.డి.నెల్లూరు మండలం నెల్లేపల్లి జడ్పీ హైస్కూల్ లోని రూం నెంబర్ 01లో పదో తరగతి పబ్లిక్ పరీక్ష ప్రారంభమైన వెంటనే తెలుగు ప్రశ్నాపత్రాన్ని పవన్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన వాట్సప్ నెంబర్ నుంచి ఇతర ప్రైవేటు వ్యక్తులకు పంపాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరూ మెసేజ్ ను ఫార్వర్డ్ చేస్తూ చిత్తూరు టాకీస్ మీడియా గ్రూపులో పోస్టు చేశారు. కొద్ది నిమిషాల అనంతరం ఆ మెసేజులను డిలేట్ చేశారు. దీనిని గమనించిన కొందరు చిత్తూరు డీఈవోకు ఫిర్యారు చేశారు.
టాకీస్ మీడియా గ్రూప్ లో పోస్టు
చిత్తూరు టాకీస్ మీడియా గ్రూపులో పోస్టు చేసిన కోణంలో పోలీసులు విచారించగా ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యం సిబ్బంది వ్యవహారం వెలుగు చూసింది. ఇందుకు కారకులైన ఏడు మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో చంద్రగిరికి చెందిన శ్రీకృష్ణరెడ్డి చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్, సురేష్, తిరుపతికి చెందిన ఎన్.ఆర్.ఐ అకాడమి సుధాకర్, చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ అరీఫ్, నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్ రెడ్డి, చైతన్య స్కూల్ డీన్ మోహన్ రెడ్డిలతో పాటు, జి.డి.నెల్లూరు మండలానికి చెందిన ఎస్.జి.టి పవన్ కుమార్, ఎస్.జి.టి సోమును చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. 111/2022 U/s 5r/w8,10 పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసు, 408 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు.