Sravana Bhargavi : అన్నమయ్య కీర్తన వివాదం, సింగర్ శ్రావణ భార్గవిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
Sravana Bhargavi : సినీ గాయని శ్రావణ భార్గవిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు శ్రీవారి భక్తులు. అన్నమయ్య కీర్తనను అశ్లీలంగా చిత్రీకరించారని ఫిర్యాదుచేశారు.
Sravana Bhargavi : అన్నమయ్య రచించిన పాటను సినీ గాయని శ్రావణ భార్గవి అశ్లీల భరితంగా చిత్రీకరించారని శ్రీవారి భక్తులు ఆరోపించారు. 'ఒకపరి ఒకపరి వయ్యారమే' పాటపై అన్నమాచార్యుల వంశీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శ్రావణ భార్గవి ఈ పాటను చిత్రీకరించిన తీరు ప్రస్తుతం దుమారం రేపుతుంది. ఒకపరి ఒకపరి వయ్యారమే పాటలో పడుకొని ఉండే సన్నివేశం, కాళ్లను చూపించడం వంటి సన్నివేశాలు చిత్రీకరించారు శ్రావణ భార్గవి. అన్నమయ్య ఆలపించి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అంకితం ఇచ్చిన పాటను సంప్రదాయ పద్ధతిలో కాకుండా, హిందువుల మనోభావాలు దెబ్బ తీసేవిధంగా చిత్రీకరించారని అన్నమయ్య వంశీయులు, శ్రీవారి భక్తులు ఆరోపిస్తున్నారు.
తిరుపతిలో అడుగుపెట్టనివ్వం
తాజాగా ఈ వివాదంపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు శ్రీవారి భక్తులు. స్వామి వారికి 32 వేల సంకీర్తనలు ఆలపించి, అంకితం చేసిన పదకవితా పితామహుడు అన్నమయ్య పాటను అవమానించడం సరికాదని భక్తులు భావిస్తున్నారు. అన్నమయ్య ఆలపించిన సంకీర్తనను అవమానించడం మంచిది కాదని తిరుపతి వాసులు అభిప్రాయపడ్డారు. ఒకపరి ఒకపరి వయ్యారమే సంకీర్తనను గాయని శ్రావణ భార్గవి తన కోసం చిత్రించకరించిన తీరు అభ్యంతరమన్నారు. శ్రావణి భార్గవిని తిరుపతిలో అడుగుపెట్టనివ్వమని, అన్నమయ్య కుటుంబానికి క్షమాపణ చెప్పాలని అదే విధంగా సోషల్ మీడియా నుంచి వెంటనే ఆ కీర్తనను తొలగించాలని తిరుపతి వాసులు డిమాండ్ చేశారు.
అసలు వివాదం ఏంటి?
కొత్త వివాదంతో చిక్కుకున్నారు సింగర్ శ్రావణ భార్గవి. అభిషేకం వేళ వేంకటేశ్వర స్వామిని కీర్తించేందుకు అన్నమయ్య రాసిన కీర్తన ‘ఒకపరి ఒకపరి వయ్యారమే’. దీన్ని శ్రావణ భార్గవి తనదైన శైలిలో పాడి, ఆ పాటలో చీరకట్టుతో తనను అందంగా చిత్రీకరించుకుంది. ఆ వీడియోను యూట్యూబ్ లోని తన ఛానెల్‌లో పోస్టు చేసింది. అది చూసిన అన్నమయ్య కుటుంబసభ్యులు ఆమెపై మండి పడ్డారు. అంతేకాదు నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో కామెంట్లు పెడుతుండడంతో ఆమె కామెంట్ సెక్షన్ క్లోజ్ చేసింది.
ఏంటా కాళ్లు ఊపడం?
‘అన్నమయ్య పెద్ద కుమారుడు పెదతిరుమలాచార్యులు స్వామివారికి అభిషేకం చేస్తూ కీర్తించిన పాట అది. ఆ పాటకు ఆమె కాళ్లు ఊపుతూ, ఆమె అందాన్ని వివిధ భంగిమల్లో చూపిస్తూ చిత్రీకరించడం తప్పు’ అని అన్నమయ్య వంశస్థులు తెలిపారు. ఈ విషయంపై శ్రావణ భార్గవికి తాము ఫోన్ చేశామని ఆమె చాలా బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చినట్టు తెలిపారు. తమతో పాటూ చాలా మంది ఆ పాటను యూట్యూబ్ నుంచి తొలగించమని కోరినా ఫలితం లేదని అన్నమయ్య వంశస్థుల్లో ఒకరైన తాళ్లపాక వెంకటరాఘవ అన్నమాచార్యులు అన్నారు.
వీడియోలో ఏముంది?
ఒకపరి ఒకపరి వయ్యారమే కీర్తనను తన హస్కీ గొంతుతో పాడింది శ్రావణ భార్గవి. అందులో ఆమె అందమైన చీరకట్టుతో సాధారణ మహిళ చేసే పనులన్నీ చేస్తూ కనిపించింది. బొట్టు పెట్టుకోవడం, పుస్తకాలు చదవడం, నవ్వడం, కాళ్లు ఊపడం... ఇలా ప్రతిది స్లోమోషన్లో చూపించారు. కాకపోతే ఆ ఆ కీర్తనను ఇంతవరకు వేంకటేశ్వరస్వామి వారికి మాత్రమే పాడేవారు. ఇలా తనను తాను అందంగా చూపించుకోవడం కోసం శ్రావణ భార్గవి ఉపయోగించుకునే సరికి చాలా మంది భక్తులు జీర్ణించుకోలేకపోయారు. ఈ పాటను రెండు రోజుల క్రితమే యూట్యూబ్ లో పోస్టు చేసింది శ్రావణ భార్గవి. ఇప్పటివరకు వ్యూస్ దాదాపు ఆరు లక్షల ఎనభై వేల దాకా వచ్చాయి.