Mla Anna Rambabu On TTD EO : టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై సీఎంకు ఫిర్యాదు చేస్తా, వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఫైర్
Mla Anna Rambabu On TTD EO : టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఒంటెద్దు పోకడలకు పోతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆరోపించారు. టీటీడీ బోర్డు, సీఎంవో ఆఫీస్ ను ఈవో లెక్కచేయడంలేదని విమర్శించారు.
![Mla Anna Rambabu On TTD EO : టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై సీఎంకు ఫిర్యాదు చేస్తా, వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఫైర్ Tirumala Ysrcp Mla Anna Rambabu fires on TTD EO Dharma reddy complaint to CM Jagan DNN Mla Anna Rambabu On TTD EO : టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై సీఎంకు ఫిర్యాదు చేస్తా, వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఫైర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/26/e61a6bd0770cc1be1506518ed3174ad71679825180672235_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mla Anna Rambabu On TTD EO : శాసన సభ్యుడికి కనీస మర్యాదలు కూడా ఇవ్వకుండా టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఒంటెద్దు పోకడతో వెళ్తున్నారన వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఫైర్ అయ్యారు. ఆదివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సామాన్య భక్తులను బూచిగా చూపిస్తూ టీటీడీ అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అంతే కాకుండా టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఒంటెద్దు పోకడలకు వెళ్తున్నారని మండిపడ్డారు. టీటీడీ బోర్డు, సీఎంవో ఆఫీస్ అంటే కూడా ఈవోకి లెక్క లేకుండా పోతుందని, ధర్మారెడ్డి ఈవోగా కొనసాగాలని ఎలా తపన పడుతున్నారో, అదే విధంగా తామంతా స్వామి వారిని దర్శించుకోవాలనే కోరిక ఉందని చెప్పారు. ఈవో ధర్మారెడ్డిపై సీఎంకి ఫిర్యాదు చేస్తానని, తిరుమలలో భక్తుల అందరికీ ఒకే నిబంధన అమలు చేస్తే, తాము కూడా సామాన్య భక్తుడిలా స్వామి వారిని దర్శనం చేసుకుంటామన్నారు. టీటీడీ అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆరోపించారు.
తిరుమలలో గంజాయి వ్యవహారంపై జనసేన నిరసన
తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడాలని జనసేన నేత రాజా రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం అలిపిరి గరుడ విగ్రహం వద్ద జనసేన పార్టీ నాయకులు మోకాళ్లపై కూర్చొని నీ కొండను నువ్వే కాపాడుకో అంటూ శ్రీవారిని ప్రార్ధిస్తూ నిరసన తెలియజేశారు. వేంకటేశ్వర స్వామి వారి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి, కొబ్బరికాయలు కొడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు తిరుమల కొండపై గంజాయి పట్టుబడిన వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలను గంజాయి కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం మార్చేస్తుందని ఆరోపించారు. తిరుమల, తిరుపతి పవిత్రతను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. టీటీడీ నిఘా వ్యవస్థ నిద్రపోతోందా అంటూ వారు ప్రశ్నించారు. గంజాయి ముఠాతో నిఘా సిబ్బంది లాలూచీ పడ్డారని, గంజాయితో ప్రారంభమై కొకైన్, డ్రగ్స్ అమ్మే పరిస్థితులు రావొచ్చని మండిపడ్డారు. గంజాయి వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
టీటీడీ విజిలెన్స్ వైఫల్యం - భాను ప్రకాశ్ రెడ్డి
తులసి క్షేత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంను గంజాయి క్షేత్రంగా మారుస్తున్నారని బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో భాను ప్రకాష్ రెడ్డి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కలియుగ వైకుంఠంమైన తిరుమలలో గంజాయి పట్టుబడడంతో భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆయన చెప్పారు. నాలుగు అంచెల భద్రతంటూ, తిరుమల భద్రతని గాలికి వదిలేశారని, టీటీడీ భద్రతా వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తనిఖీల్లో పట్టుబట్టకుండా తిరుమలకి నిషేధిత వస్తువులు యధేచ్ఛగా వస్తుందని, టీటీడీలో కొందరు అధికారులు డబ్బులు తీసుకుని చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో ఇలా గంజాయి తిరుమలకు వస్తుందన్నారు. అయితే తిరుమలకు గంజాయి అక్రమ రవాణాపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గంజాయి అక్రమ రవాణాపై ఏపీ చీఫ్ సెక్రెటరీకి, డీజీపీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)