Tirumala Helicopters : తిరుమల శ్రీవారి ఆలయంపై హెలికాఫ్టర్లు చక్కర్లు, అప్రమత్తమైన టీటీడీ!
Tirumala Helicopters : తిరుమల శ్రీవారి ఆలయంపై హెలికాఫ్టర్ లు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. ఈ ఘటనపై టీటీడీ విచారణ చేపట్టింది.
Tirumala Helicopters : తిరుమలలో హెలికాఫ్టర్ లు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. శ్రీవారి ఆలయంపై మూడు హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టాయి. తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లైయింగ్ జోన్ గా టీటీడీ ప్రకటించింది. హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టడంపై అప్రమత్తమైన టీటీడీ.. విచారణ చేపట్టింది. అయితే తిరుమలపై చక్కర్లు కొట్టిన హెలికాప్టర్లు ఏయిర్ పోర్స్ విభాగానికి చెందినవిగా గుర్తించారు. కడప నుంచి చెన్నైకి వెళ్లే సమయంలో తిరుమల మీదుగా ప్రయాణించినట్లు సమాచారం.
మూడు హెలికాఫ్టర్లు చక్కర్లు
శ్రీవారి ఆలయం పరిసరాల్లో మంగళవారం సాయంత్రం మూడు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. దీంతో భక్తులను ఆందోళనకు గురైయ్యారు. శ్రీవారి ఆలయానికి సమీపంలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పరాకమణి భవనం, బాలాజీనగర్ ప్రాంతంలో హెలికాప్టర్‌లు చక్కర్లు కొట్టినట్లు అధికారులు గుర్తించారు. తిరుమలలో 3 హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్లు కడప నుంచి చెన్నై వెళ్తుండగా తిరుమల మీదుగా చక్కర్లు కొట్టినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ఈ ఘటనపై టీటీడీ అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
గతంలో డ్రోన్ కలకలం
తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఓ వీడియో ఇటీవల నెట్టింట హల్ చల్ చేసింది. ఈ వీడియో వైరల్ అవడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ కెమెరాల్లో శ్రీవారి ఆలయాల చిత్రీకరించడంపై ఆరా తీశారు. తిరుమల శ్రీవారి ఆలయంపై, పరిసర ప్రాంతాల్లో విమానాలు, డ్రోన్ కెమెరాలు నిషేధం ఉంది. అయితే శ్రీవారి ఆలయానికి సంబంధించిన వీడియాను ఓ యూట్యూబ్ ఛానల్ పోస్టు చేయడం కలకలంగా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారడంపై శ్రీవారి భక్తులు, ఆగమ సలహాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగమశాస్ర్త నిబంధనల మేరకు ఆనంద నిలయ గోపురం చిత్రీకరణకు అనుమతులు లేవని టీటీడీ తెలిపింది. శ్రీవారి ఆలయాన్ని చిత్రీకరించి, సోషల్ మీడియాలో వైరల్ చేసిన విజువల్స్ పై విచారణ జరిపి నిందితులను పట్టుకున్నారు. హైదరాబాద్ కు చెందిన వారు విజువల్స్ ని అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. వీళ్లపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
1008 మంది ప్రత్యేక ప్రతిభావంతులకు శ్రీవారి దర్శనం
ప్రత్యేక ప్రతిభావంతులైన పిల్లల కోరికను నెరవేర్చే దిశగా చెన్నై ఫుడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఓ బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది టీటీడీ. 1008 మంది ప్రత్యేక ప్రతిభావంతుల కోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేయటమే కాకుండా లోకల్ టెంపుల్ అథారిటీ సహకారంతో శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించింది. రాజస్థానీ యూత్ అసోసియేషన్ మద్రాస్ మెట్రో ఆర్గనైజషన్ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దివ్యాంగులు, అనాథ పిల్లల కోసం శ్రీవారి దర్శనం ఏర్పాటు చేయాలని భావించారు. శ్రీవారి దర్శనం అంతా సులభం కాదని, అది కూడా వెయ్యికి పైగా పిల్లలను శ్రీవారి దార్శనికి తీసుకురావాలంటే ముందుగా టీటీడీని ఆశ్రయించాలని భావించారు. తమిళనాడు లోకల్ అడ్వైసరి కమిటీ చైర్మన్ శేఖర్ రెడ్డిని ఆశ్రయించారు. అదే విషయాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో మాట్లాడారు. మంగళవారం ఉదయం ప్రత్యేక రైలులో చెన్నై నుంచి రేణిగుంట రైల్వే స్టేషన్ కు చేరుకున్న 1008 చిన్నారులకు... రేణిగుంట అధికారులు, పోలీసులు స్వాగతం పలికారు. వారంతా దాదాపు 30 బస్సులలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. టీటీడీ వారికి విశేష వీఐపీల కింద ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. 1008 మందికి శీఘ్ర దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంది. పిల్లలు ఎంతో ఆనందంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్నప్రసాదం స్వీకరించారు. అక్కడ నుంచి 30 బస్సుల ద్వారా రేణిగుంటకు చేరుకొని.... చెన్నైకి తిరుగుప్రయాణం అయ్యారు.