Tirumala News : చిన్నారి వైద్యానికి సీఎం జగన్ భారీ సాయం-థ్యాంక్యూ సీఎం సార్ అంటూ తల్లిదండ్రులు తిరుపతికి పాదయాత్ర
Tirumala News : అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి సీఎం జగన్ భారీ సాయం చేశారు. సీఎం ఆదేశాలతో చిన్నారికి సకాలంలో వైద్యం అందింది. దీంతో తల్లిదండ్రులు థ్యాంక్యూ సీఎం సార్ అంటూ తిరుమలకు పాదయాత్రగా చేరుకున్నారు.
![Tirumala News : చిన్నారి వైద్యానికి సీఎం జగన్ భారీ సాయం-థ్యాంక్యూ సీఎం సార్ అంటూ తల్లిదండ్రులు తిరుపతికి పాదయాత్ర Tirumala Parents Padayatra from West godavari to Tirupati for child healt cured after CM Jagan help DNN Tirumala News : చిన్నారి వైద్యానికి సీఎం జగన్ భారీ సాయం-థ్యాంక్యూ సీఎం సార్ అంటూ తల్లిదండ్రులు తిరుపతికి పాదయాత్ర](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/23/93a7777ccd5c000b9ebba72bea4ff56d1669211650271235_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tirumala News : ఎన్నో రకాల వ్యాధులు మానవులను పట్టి పీడిస్తున్నాయి. వ్యాధి నివారణకు చిన్న, పెద్ద తేడా లేకుండా తరచూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటారు. అంతు చిక్కని అరుదైన వ్యాధి చిన్నారులకు వస్తే మాత్రం, అసలు ఏం చేయాలో పాలుపోలేని స్థితి ఆ తల్లిదండ్రులది. అంతు చిక్కని వ్యాధి చికిత్సకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తే, ఓ మధ్య తరగతి కుటుంబం వేధన చెప్పలేనిది. అలాంటి కష్టమే ఓ కుటుంబానికి వచ్చింది. అయితే ఆ కుటుంబానికి ప్రభుత్వం అండ లభించింది. సీఎం జగన్ భరోసాతో ఆ చిన్నారికి సకాలంలో వైద్యం అందింది. అంతే కాకుండా చిన్నారి వైద్యానికి కావాల్సిన భారీ మొత్తాన్ని ప్రభుత్వం రిలీజ్ చేసింది.
సీఎం జగన్ భరోసాతో చిన్నారికి చికిత్స
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్యలంక గ్రామానికి చెందిన రాంబాబు, నాగలక్ష్మి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే వీరి రెండో సంతానమైన చిన్నారికి అంతుచిక్కని వ్యాధి సోకి అనారోగ్యం పాలైంది. ఎన్నో ఆసుపత్రుల్లో సంప్రదించి చికిత్స అందించారు. కానీ నయం కాలేదు. కానీ ఆ వ్యాధి నయం కావాలంటే కోటి రూపాయలపైగా అవుతుందని వైద్యలు తేల్చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ చిన్నారి కుటుంబం అయోమయం స్థితిలో పడింది. తమకు ఎవరు సాయం చేస్తారో తెలియని స్థితిలో తెలిసిన వారందనీ సాయం అడిగారు. కానీ అంత మొత్తంలో డబ్బును ఎవరూ సమకూర్చలేకపోయారు. జులై నెలలో సీఎం జగన్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. అదే సమయంలో సీఎంను కలిసేందుకు దంపతులిద్దరూ సీఎం వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. వారిని గమనించిన సీఎం జగన్ కాన్వాయ్ ను ఆపమని ఆదేశించారు. ఆ దంపతులను సీఎం వద్దకు తీసుకెళ్లారు. దీంతో సీఎం వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. చిన్నారి చికిత్సకు హామీ ఇచ్చిన జగన్, ఈ బాధ్యతను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు.
తిరుపతికి పాదయాత్రగా
దీంతో సజ్జల రామకృష్ణా రెడ్డి ఆయన ఓఎస్డీ ప్రత్యేక చొరవ చూపి చిన్నారి వైద్యానికి అయ్యే నగదును విడుదల చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దయ చూపమని కోరితే, సీఎం జగన్ రూపంలో మమల్ని కరుణించారని కృతజ్ఞతలు వ్యక్తం చేశారు చిన్నారి తల్లిదండ్రులు. సీఎం జగన్ అమలు చేసిన జిల్లాల విభజన మాకు మరింత మేలు చేసిందని, లేకుంటే మేము కాకినాడ వెళ్లాల్సి వచ్చేదని చెప్పుకొచ్చారు. కోరిక నెరవేరడంతో వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తూ తిరుమలకు చేరుకున్నామని తెలిపారు. థాంక్యూ సీఎం సార్ అంటూ తమ మొక్కులు చెల్లించుకోవడానికి శ్రీవారి వద్దకు పాదయాత్రగా వచ్చారు ఆ దంపతులు.
సీఎం జగన్ ఉదారత
సీఎం జగన్ మరోసారి ఉదారత చాటుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పర్యటనలో బహిరంగ సభకు వెళ్తూ కాన్వాయ్ నుంచి గమనించి బాధితులను పరామర్శించారు. తమ కుమార్తె వైద్యానికి అవసరమైన సాయం చేయాలని విజయనగరం జిల్లా చిన్న శిర్లాం గ్రామానికి చెందిన మీసాల కృష్ణవేణి సీఎం జగన్ ను వేడుకున్నారు. కృష్ణవేణి కుమార్తె ఇంద్రజ (7 సంవత్సరాలు) అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. చిన్నారి పరిస్థితిని తల్లిదండ్రులు సీఎంకి వివరించారు. వెంటనే స్పందించిన సీఎం వైఎస్ జగన్, ఇంద్రజకు అవసరమైన పూర్తి వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)